బీ ఫామ్ టెన్షన్!
‘అన్న.. ఎటూ చెప్పడం లేదు.. చూస్తేనేమో టైం ఎక్కువ లేదు.. పార్టీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్‌గా మరోనామినేషన్ ఎయ్యనా.. ముందే తొందరపడితే బీ – ఫామ్ రాకుండా పోతుందా.. ఏమీ సమజైతలే.. ఎవరికో ఒకరికి టికెట్ ఖరారు చేస్తే.. ఇది కాకపోతే సింహం గుర్తు అయినా తెచ్చుకుంటా.. కానీ, ఈసారి బరిలో నిల్చుండుడే.. మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదో.. అన్నను నమ్ముకొని ఉంటే బీ ఫామ్ రాకపోతే ఎట్లా?’ అని జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో ఇంకా టికెట్లు ఖరారు కాని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ఆశావహులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో బుధవారం రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్ విడుదలైనా.. నామినేషన్ల స్వీకరణ మేడారం జాతర తర్వాత ఉంటుందనుకున్నా.. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరిస్తుండడంతో ఆశావహులు హైరానా పడుతున్నారు. కొందరు ఆస్తి తదితర పన్నులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లు తీసుకోవడం, కులం తదితర ధ్రువీకరణపత్రాలు, అఫిడవిట్లు తయారు చేసుకోవడంతోపాటు నామినేషన్ ఫామ్‌లు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. దీంతో తొలిరోజు జిల్లావ్యాప్తంగా నామినేషన్లు స్వల్పంగానే దాఖలయ్యాయి
జిల్లాలో 102 నామినేషన్లు
రామగుండం కార్పోరేషన్‌లో 60 వార్డులకు బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఒకరు.. మొత్తంగా 13 మంది తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మంథనిలో 13 వార్డులకు బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 13 మంది, సుల్తానాబాద్‌లో 15వార్డులకు బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, చిన్నపార్టీల నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 24 మంది, పెద్దపల్లిలో 36 వార్డులకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 124 వార్డులకు 102 నామినేషన్‌పత్రాలు దాఖలయ్యాయి.
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు
కార్పొరేషన్, మున్సిపల్ మేయర్, చైర్‌పర్సన్ పీఠాలే లక్ష్యంగా కాంగ్రెస్ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తోంది. ప్రధానంగా సర్వే ఆధారంగా, భారీగా ఖర్చుచేసే సామర్థ్యం ఉన్నవారికే టికెట్లు ఇస్తోందంటున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు అన్నివార్డుల్లో అభ్యర్థులు లేక అధికార పార్టీ నుంచి టికెట్ రాని వారికి అవకాశం కల్పించేందుకు ఎదురుచూస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరిరోజు కావడంతో అన్నిపార్టీల్లోనూ బీ ఫామ్‌లు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సింహం గుర్తువైపు రెబెల్స్ చూపు
పెద్దపల్లి: అధికార పార్టీలో టికెట్ దక్కనివారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల గుర్తు సింహంపై దృష్టి సారించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని బల్దియాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధమైన పలువురికి స్థానిక నాయకత్వం టికెట్లు నిరాకరించడంతో ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత నాయకత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై హక్కులు తీసుకోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో దిగేందుకు వరుస కడుతున్నారు. ఇప్పటికే పలువార్డుల్లో కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు.
అసమ్మతివాదుల సమావేశం
పలు పార్టీల్లోని అసమ్మతి నాయకులు తెలంగాణ జాగృతి కార్యాలయ ఇన్‌చార్జి పొన్నమనేని బాలాజీరావు, జిల్లా కన్వీనర్ కోదాటి శ్రీనివాసరావుతో బుధవారం సుల్తానాబాద్‌లో సమావేశమయ్యారు. వార్డు/డివిజన్లలో పోటీచేసేవారు సింహం గుర్తును ఇష్టపడుతున్నారని నాయకులు తెలిపారు. మరోవైపు.. అన్ని మున్సిపల్ వార్డులు, డివిజన్లలో తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీలో నిలుపుతామని స్పష్టం చేశారు.
ప్రారంభమైన నామినేషన్ల పర్వం
తొలిరోజే 102 దాఖలు
టికెట్ ఖరారు కానివారిలో తీవ్ర ఉత్కంఠ
నామినేషన్ వేద్దామా? వద్దా? అనే డైలామాలో మరికొందరు ఆశావహులు
తొలిరోజు దాఖలైన నామినేషన్లు
రామగుండం 13
పెద్దపల్లి 52
సుల్తానాబాద్ 24
మంథని 13


