మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల మహిళలలకు మంజూరైన దాదాపు 100 కుట్టు మిషన్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళాశక్తి రేవంతన్నక భరోసా’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ముస్లిం మహిళలు కుట్టుమిషన్ల ద్వారా ఇంట్లోనే ఉపాధిపొందే అవకాశం ఉందన్నారు. త్వరలో మైనార్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, గంభీరావుపేటలో మైనార్టీల కోసం కమర్షియల్ కాంప్లెక్స్, మజీద్ అభివృద్ధి, అత్యాధునిక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి కులమత, రాజకీయాలకతీతంగా సేవలందిస్తానన్నారు. సమష్టిగా పనిచేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్దమ్మ బస్‌స్టేజీని ఎక్స్‌ప్రెస్ స్టాప్‌గా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడడం జరిగిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి భారతి, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ


