కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చలు
జ్యోతినగర్(రామగుండం): సౌదీ అరేబియా రియాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచస్థాయి గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్‌లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా తెలిపారు. మంగళవారం ప్రపంచ స్థాయి ముగింపు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఫోన్ ద్వారా పలు విషయాలను వెల్లడించారు. భారతదేశంలోని కార్మికులకు సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం చెల్లించడం అమలు కావడం లేదన్నారు. భారత ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్రఅన్యాయం జరుగుతోందని ఉదాహరణలతో సహా వివరించానని వెల్లడించారు. యువతకు చదువుతోపాటు తగిన వృత్తి నైపుణ్యాలను నేర్పించడం ద్వారా స్వయంగా జీవనం కొనసాగిస్తారని సూచించినట్లు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


