బోర్లెన్ని.. వ్యవసాయ బావులెన్ని?
మంథనిరూరల్: సాగు ప్రణాళిక రూపకల్పనకు దోహదపడేలా జిల్లావ్యాప్తంగా సాగునీటి వనరుల లెక్కింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటల లెక్క పక్కాగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో జీపీవోలు పర్యటించి సాగునీటి వనరులను లెక్కిస్తూ ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
జిల్లాలోని 204 రెవెన్యూ గ్రామాల్లో..
జిల్లావ్యాప్తంగా 212 రెవెన్యూ విలేజీలు ఉండగా 204 గ్రామాల్లో సాగునీటి వనరుల లెక్క ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. మిగతా రెవెన్యూ విలేజీలు సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ) విస్తరణతోపాటు విలీనాలతో తగ్గిపోయాయి. జిల్లాలోని 109 మంది జీపీవోలు లెక్కింపు సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మిగతా గ్రామాల్లో స్థానిక ఏఈవోలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సాయంతో సాగునీటి వనరుల గణన కొనసాగుతోంది.
జిల్లావ్యాప్తంగా 44,541 సాగునీటి వనరులు
ప్రతీ ఐదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం సాగునీటి వనరుల గణాంకాలు చేపడుతోంది. గతంలో చేసిన లెక్కల ప్రకారం జిల్లాలోని 212 రెవెన్యూ గ్రామాల్లో 44,541 సాగునీటి వనరులు ఉన్నట్లు తేలింది. ఇందులో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు 1,402 ఉండగా, బోర్లు 6,800 ఉన్నాయని, మిగతావన్నీ సాగునీటి వనరులని అధికారులు చెబుతున్నారు.
సాగునీటికి జియోట్యాగింగ్
గ్రామాల్లో సాగునీటి వనరుల లెక్కింపు చేపట్టిన జీపీవోలు వివరాలు నమోదు చేసుకుని ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన డబ్ల్యూబీ సెన్సెన్ అనే యాప్‌లో అప్‌లోడ్ చేసి జియోట్యాగింగ్ చేస్తున్నారు. బోర్లు, బావులను నీటి అవసరాలకు వినియోగిస్తున్నారా? లేదా? నిర్వహణ తీరు ఎలా ఉంది? అనే అంశాలను పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. సాగునీటి వనరుల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రాజెక్టులు అమలు చేస్తారని, సాగుకు అవసరమయ్యే ప్రణాళికలు రూపొందిస్తారని అధికారులు చెబుతున్నారు.
భూగర్భజలాల లభ్యత అంచనా
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయానికి ఎక్కువగా బోరుబావులను వినియోగిస్తుంటారు. దీంతో బోరుబావుల్లో భూగర్భజలాల లభ్యతను అంచనా వేస్తూ నమోదు చేసుకుంటున్నారు. రైతు ఎన్ని అడుగుల లోతులో బోరు వేశాడని, ఎన్నిగంటల సమయం నీరు పారుతుందనే వివరాలు తెలుసుకుని భూగర్భజలాల లభ్యతను అంచనా వేస్తున్నారు. అలాగే బావుల్లో వర్షాకాలం, వేసవి కాలాల్లో ఎంతమట్టంలో నీరు ఉంటుందనే వివరాలనూ నమోదు చేస్తున్నారు.
పక్కాగా సాగునీటి వనరుల లెక్క
జిల్లాలో ప్రారంభమైన గణన
జియోట్యాగింగ్‌కు సర్కారు కసరత్తు
పంటల సాగు ప్రణాళిక రూపకల్పనకు దోహదం
త్వరలో లెక్కింపు పూర్తి
జిల్లాలోని 204 రెవెన్యూ గ్రామాల్లో పారదర్శకంగా సాగునీటి వనరుల గణన కొనసాగుతోంది. జీపీవోలు లెక్కింపు చేస్తూ ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. జీపీవోలు లేనిగ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు లెక్కింపు చేస్తున్నారు. త్వరలోనే సాగునీటి వనరుల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తాం.
– రవీందర్, సీపీవో, పెద్దపల్లి


