నగరమైన గ్రామం
● నోటిఫైడ్ ఏరియా నుంచి ప్రయాణం
● నేడు 60 డివిజన్లుగా రామగుండం కార్పొరేషన్ ఆవిర్భావం
కోల్‌సిటీ(రామగుండం): జనగామ గ్రామ పంచాయతీగా మొదలైన రామగుండం ప్రయాణం నేడు నగరంగా విస్తరించింది. అప్పుడు 11 వార్డులకు పరిమితమైన ఊరు.. ఇప్పుడు 60 డివిజన్లకు విస్తరించి నగరపాలక సంస్థగా ఎదిగింది.
నగరంగా ఎదిగిన బల్దియా
జనగామ, మేడిపల్లి, మల్కాపూర్, జంగాలపల్లి, రామగుండం, లక్ష్మీపురం(ఎల్కలపల్లి హామ్లెట్), మారేడుపాక, అల్లూరు గ్రామాల విలీనంతో 1982 లో రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ఏర్పడింది. అప్పటివరకు 11 వార్డులతో ఉన్న గ్రామ పంచా యతీ సర్పంచ్‌గా గీట్ల జనార్దన్‌రెడ్డి వ్యవహరించా రు. నోటిఫైడ్ కమిటీ తొలిచైర్మన్‌గా అప్పటి ఎమ్మె ల్యే మాతంగి నర్సయ్య, రెండోచైర్మన్‌గా అప్పటి ఎమ్మెల్యే మాలెం మల్లేశం వ్యవహరించారు. 1995 లో ద్వితీయ శ్రేణి, 2001లో ప్రథమ శ్రేణి, 2003లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది.
2010లో నగరపాలక సంస్థగా..
ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా ఉన్నప్పుడు 1997లో ప్రత్యక్ష పద్ధతిన జరిగిన ఎన్నికల్లో సోమా రపు సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004లో బడికెల రాజలింగం చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. సెక్షన్ గ్రేడ్ స్థాయి అవసరం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో 34 వార్డులతో ఉన్న మున్సిపాలిటీని 50 డివిజన్లుగా 2010 ఫిబ్రవరి 25న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. 2014 మార్చిలో జరిగిన పరోక్ష ఎన్నికల్లో కొంకటి లక్ష్మీనారాయణ మేయర్‌గా ఎన్నికయ్యారు. 2020లో డాక్టర్ బంగి అనిల్ కుమార్ గెలుపొందారు.
100 చ.కి.మీ. విస్తీర్ణం
93.87 చ.కి.మీ. వైశాల్యం కలిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇప్పుడు 100 చ.కి.మీ.కు విస్తరించింది. 50 డివిజన్ల నుంచి 60 డివిజన్లకు పెరిగింది. గతేడాది జూన్‌లో సమీప లింగాపూర్, వెంకట్రావ్‌పల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్‌నగర్‌ను విలీనం చేసి నగరాన్ని విస్తరించారు.


