అదనపు ఠాణాలు అవసరమే..!
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సుమారు 2కి.మీ. దూరంలోని గోదావరి నది వద్ద జరిగే నేర స్థలానికి రూ.15 కి.మీ. దూరంలోని టూటౌన్ పోలీసులు వెళ్తున్నారు. ఘటన స్థలానికి వేగంగా చేరుకోవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితిలేదు.
రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి ఠాణా పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్‌లో ఉంది. దానిని గోదావరిఖనిలో విలీనం చేయాలనే డిమాండ్ ఉంది.
రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలను కలిపి రూరల్ సర్కిల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడంలేదు.
రామగుండం సమీపంలోని కుందనపల్లి, లింగాపూర్‌ను అంతర్గాం నుంచి రామగుండం ఠాణాకు మార్చాల్సి ఉంది.
విస్తరిస్తున్న రామగుండం నగరం పారిశ్రామికంగానూ వేగంగా అభివృద్ధి పెరుగుతున్న జనాభా, నేరాలు, ప్రమాదాల సంఖ్య మరిన్ని పోలీస్‌స్టేషన్లు అవసరమని ప్రజల నుంచి డిమాండ్
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతా నికి రాష్ట్రంలోనే ప్రత్యేకస్థానం ఉంది. వివిధ రాష్ట్రాల ప్రజల సమ్మేళనంతో ముడిపడి ఉంది. విలక్షణ జీవన విధానం ప్రత్యేకతగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణ కూడా అత్యంత కీలకంగా మారింది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను అనుసంధానిస్తూ గోదావరిఖని కేంద్రంగా రామగుండం పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మ 2016 అక్టోబర్ 11న కమిషనరేట్ ప్రారంభించారు. తద్వారా రెండు జిల్లాల్లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి.
పరిశ్రమలకు నిలయం..
రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించి పెట్టే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, అల్రాటెక్ లాంటి పరిశ్రమలు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఉన్నాయి. అయితే, పారిశ్రామిక విస్తరణ, జనాభా పెరుగుతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌స్టేషన్ల వికేంద్రీకరణ చేపట్టలేదంటున్నారు.
రామగుండం కార్పొరేషన్.. పెరగని ఠాణాల సంఖ్య
రామగుండం నగరం 50 నుంచి 60 డివిజన్లకు పెరిగింది. 35 డివిజన్లు కేవలం గోదావరిఖనిలోనే ఉన్నాయి. ఇక్కడ ఒకేఠాణా ఉంది. నేరాల నియంత్రణ సాధ్యం కావడంలేదు. గోదావరి వంతెన, జనగామ, గంగానగర్, ఐబీకాలనీ, పవర్‌హౌస్ కాలనీ, సప్తగిరికాలనీ, జీఎం కార్యాలయం, జీఎం ఆఫీస్, డిగ్రీకళాశాల, మెడికల్ కాలేజీలు కలిపి మరోపోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది.
ప్రతిపాదనలోనే మహిళా పోలీస్‌స్టేషన్
రెండు లా అండ్ ఆర్డర్ ఠాణాలతోపాటు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఇంకా అమలుకు నోచుకోవడంలేదు. గోదావరిఖని వన్‌టౌన్ పాతభవనాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కోసం కేటాయిస్తామని చెప్పినా సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. మహిళా సమస్యలు, నేరాలపై సుమారు 30కి.మీ. దూరంలోని పెద్దపల్లికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
గోదావరి తీరంలోనే నేరాలు..
రామగుండం నగర శివారులోని గోదావరితీరంలో నేరాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం, హైవేరోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకోవడం నిత్యకృత్యంగా మారాయి. ఈ ప్రాంతాన్ని గోదావరిఖని వన్‌టౌన్ ఠాణాలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఇప్పటివర కు కార్యరూపం దాల్చడంలేదు.
ఎన్టీసీపీ సర్కిల్‌కు మోక్షం ఎప్పుడు?
ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ విస్తరణ, పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎన్టీపీసీ సర్కిల్ టౌన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. దీనిపై ప్రతిపాదనలు పంపించినా అమలుకు నోచుకోవడంలేదు.


