సంఘటిత పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్ట్ నేత ప్రసాదరావు 45 ఏళ్ల తర్వాత స్వగ్రామం వడ్కాపూర్‌లో ‘పుల్లూరు’ సందడి ఆత్మీయంగా పలకరించిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు
పెద్దపల్లి/జూలపల్లి: ప్రజలు సంఘటిత పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని జనజీవన ప్రవంతిలో కలిసిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత పుల్లూరు ప్రసాదరావు ఉరఫ్ చంద్రన్న అన్నారు. ఇటీవల లొంగిపోయిన ఆయన.. తొలిసారి ఆయన ఆదివారం తన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ వచ్చారు. మిత్రులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
పునరావాసం కల్పించాలి..
ప్రసాదరావు మాట్లాడుతూ, మాజీలు ఇళ్లు లేక, పునరావాసం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరారు. తెలంగాణలో కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ ఉండేదని, దోపిడీలేని సమాజం కోసమే తాను మావోయిస్టు పార్టీలోకి వెళ్లానని తెలిపారు. ఆరోగ్యం సహకరించకనే జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు చెప్పారు.
రాజకీయ పార్టీల్లో చేరను..
తనను వివిధ రాజకీయ పార్టీలు చేరాలని ఆహ్వానిస్తున్నాయని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు చట్ట పరిధిలో కృషి చేస్తానని ప్రసాదరావు వివరించారు. అడిషనల్ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన జగదీశ్వర్‌రావు, సర్పంచ్ పుల్లూరి ప్రశాంతి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ వేణుగోపాలరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్‌సింగ్, మాజీ సర్పంచులు ఆడప లక్ష్మణ్, రాజయ్య, తిరుపతి, మిత్రులు చొక్కారెడ్డి, ఎర్రోల్ల రాములు, సంతోష్‌కుమార్, సాగర్‌రావు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
45 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి..
పుల్లూరు ప్రసాదరావు దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం పెద్దపల్లిలో ఇంటర్ చదివారు. ఆ సమయంలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై అడవిబాట పట్టారు. సుమారు 45ఏళ్ల తర్వాత స్వగ్రామానికి రావడం చారిత్రక ఘట్టం. ఇన్నేళ్లుగా వార్తలు, పోలీసు రికార్డుల్లో చూసి.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం గొప్ప అనుభూతి అని గ్రామస్తులు తెలిపారు.
గుర్తుచేసుకున్న బాల్యస్మృతులు..
ప్రసాదరావు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. గ్రామంలో కలియ తిరిగారు. తాను పుట్టి పెరిగిన ఇల్లు, ఆ గోడలు, వాకిలి చూసి భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితులతో కలిసి ఆడుకున్న వీధులు, చెరువు గట్లు, చదువుకున్న బడి వంటి ప్రదేశాలు సందర్శించారు. కాలక్రమంలో మారిన ఊరును చూసి ఆశ్చర్యపోయారు.
ఆత్మీయ పలకరింపులు
సుదీర్ఘకాలం తర్వాత రక్తసంబంధీకులు, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆ కుటుంబంలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. వృద్ధులైన బంధువులు ఆయన్ని గుర్తుపట్టి కన్నీరు పర్యంతమయ్యారు. కొత్తతరం(వరుసకు మనుమలు, మనుమరాళ్లు) తమ కుటుంబంలోని ఒక ప్రముఖుడిని చూడటానికి ఉత్సాహం చూపారు. ఆయన రాజకీయ భావజాలం ఎలా ఉన్నా క్షేమంగా తిరిగి రావడంతో ఆత్మీయంగా సత్కరించారు.


