తేలనున్న వన్యప్రాణుల లెక్క
ఆరు రోజుల్లో పూర్తి
మంథనిరూరల్: వన్యప్రాణుల గణనకు అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో విస్తరించి ఉన్న అడవుల్లో జంతువులు, వన్యప్రాణుల లెక్క తేల్చనున్నారు. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లోని అడవుల్లో పర్యటిస్తున్న అధికారులు.. వాటి లెక్క తేల్చనున్నారు. తూర్పు అడవుల్లో ఇటీవల పెద్దపులులు సంచరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పులులు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, తోడేళ్లలాంటి జంతువులు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయని లెక్కించనున్నారు.
నాలుగేళ్లకోసారి లెక్కింపు
2006 నుంచి ప్రతీనాలుగేళ్ల కోసారి ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్ పేరిట వన్యప్రాణుల గణన చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఇలా లెక్కింపు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మరోసారి లెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. గతంతో పోల్చితే వన్యప్రాణుల సంఖ్య పెరిగిందా? లేక తగ్గిందా? అని తేలనుంది.
జిల్లావ్యాప్తంగా..
జిల్లాలో అటవీ విస్తీర్ణం అధికంగానే ఉంది. జిల్లావ్యాప్తంగా 31.100హెక్టార్ల అటవీ భూములు ఉండగా 14.80శాతం అడవులే ఉన్నాయి. రెండు రేంజ్‌ల పరిధిలో 11 సెక్షన్‌లు, 33 బీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మంథని, ముత్తారం, రామగిరి, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణం ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య పర్యవేక్షణలో వన్యప్రాణుల గణన కోసం బీట్, సెక్షన్ అధికారులు బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతాల్లో పరిశీలనలు చేస్తున్నారు.
జంతు కదలికల ఆధారంగా
అడవుల్లో జంతు కదలికల ఆధారంగా వాటి జాతిని గుర్తిస్తారు. ముఖ్యంగా శాఖాహార, మాంసాహార జంతువులుగా విభజించి లెక్కింపు చేస్తారు. ప్రతీరెండు కిలోమీటర్ల చొప్పున జంతువుల లెక్కను పరిగణలోకి తీసుకుంటారు. పాదముద్రలు, చెట్లకు గాట్లు, అరుపులు, భూమిని తవ్వటం లాంటి ఆనవాళ్లతో అది ఏ జంతువులో గుర్తిస్తారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమగ్ర సమాచారాన్ని ఐదు రకాలుగా విభజించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.
సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ
వన్యప్రాణుల లెక్కింపు సందర్భంగా అటవీశాఖ అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అటవీప్రాంతంలో ముందుగా పరిసరాలను పరిశీలించిన తర్వాతనే వన్యప్రాణుల ఆనవాళ్లతో లెక్కిస్తారు. లెక్కింపు విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటారు.
అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణుల గణన ఆరు రోజులు కొనసాగుతుంది. ఈనెల 20న మొదలై ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీతో ముగిసింది. తొలిమూడు రోజులు ప్రతీబీట్ పరిధిలోని 5 కి.మీ. మేర మాంసాహార జంతువుల గురించి పరిశీలన చేశాం. వాటి పాదముద్రలు, మలమూత్రాలు, కాలిగోర్ల గీతల ఆనవాళ్లను బట్టి మాంసాహార జంతువులను గుర్తించాం. అలాగే ప్రతీరోజు రెండు కి.మీ. మేర శాఖాహార జంతువుల సంచారం, వాటి ఆనవాళ్లను గుర్తించాం. సేకరించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదుచేసి జాతీయ వన్యప్రాణి సంస్థకు పంపిస్తాం.
– శివయ్య, జిల్లా అటవీశాఖ అధికారి
అడవిలో పూర్తయిన జంతు సర్వే
ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు
నాలుగేళ్లకోసారి వన్యప్రాణుల గణన
ముగిసిన జంతు లెక్కింపు ప్రక్రియ
తేలనున్న వన్యప్రాణుల లెక్క


