కమ్యూనిస్ట్‌గానే జీవిస్తా.. కమ్యూనిస్ట్‌గానే మరణిస్తా | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్ట్‌గానే జీవిస్తా.. కమ్యూనిస్ట్‌గానే మరణిస్తా

Jan 26 2026 6:40 AM | Updated on Jan 26 2026 6:40 AM

కమ్యూనిస్ట్‌గానే జీవిస్తా.. కమ్యూనిస్ట్‌గానే మరణిస్తా

కమ్యూనిస్ట్‌గానే జీవిస్తా.. కమ్యూనిస్ట్‌గానే మరణిస్తా

బూర్జువా రాజకీయ పార్టీల్లో చేరేది లేదు

చట్టం, రాజ్యాంగానికి లోబడే ఉద్యమిస్తా

‘సాక్షి’తో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు

పెద్దపల్లి: పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ స్థాపన, సమానత్వం కోసం పనిచేస్తానని ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసి మావోయిస్ట్‌ పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఉరఫ్‌ చంద్రన్న ఉరఫ్‌ ఆత్రం రామారావు అన్నారు. పెద్దపల్లిలో ఇంటర్‌ చదువుతుండగానే రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరానని అన్నారు. ఆ తర్వాత అప్పటి పీపుల్స్‌వారిలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని పేర్కొన్నారు. తాడిత, పీడితుల కోసం, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ నాలుగున్న దశాబ్దాలపాటు ఉద్యమించానని, అనారోగ్య సమస్యలతో జన్‌జీవన స్రవంతిలో కలిశానని వెల్లడించారు. తన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌ గ్రామానికి ఆదివారం ఆయన చేరుకున్నారు. ‘సాక్షి’ ఆయనను పలుకరించగా.. ఉద్యమ ప్రస్థానం, అనుభవాలు, అనారోగ్య కారణాల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే..

కుటుంబసభ్యులు, రక్తసంబంధీకులు, గ్రామస్తులను కలవడాన్ని ఏమనుకుంటున్నారు?

ప్రసాదరావు: చిన్ననాటి స్నేహితులను కలువడం సంతోషంగా ఉంది. అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న. వారి ఆత్మీయత పలకరింపు ఎంతోతృప్తి ఇచ్చింది. మల్లోజుల కోటేశ్వరరావు, కంది లచ్చిరెడ్డి, బయ్యపు దేవేందర్‌రెడ్డి, దగ్గు రాజలింగును చూసి నేను పీపుల్స్‌వార్‌ పార్టీలోకి వెళ్లా.

ఏఏ జిల్లాల్లో పనిచేశారు?

ప్రసాదరావు: 1980లో సుమారు ఆరునెలల పాటు కరీంనగర్‌ జిల్లాలో పనిచేశా. 20 సంవత్సరాలపాటు ఖమ్మం, 25 సంవత్సరాలపాటు ఆదిలాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌లో పనిచేశా. ‘పుట్టింది ఒకసారి.. చచ్చేది ఒకసారి’ అనే సిద్ధాంతంతోనే పార్టీలో చేరా.

వ్యవస్థ ఎలా ఉంది?

ప్రసాదరావు: రాజ్యాంగం అమలు చేస్తే మావోయిస్టు అనే పదమే ఉండదు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నక్సలైట్‌ ఉద్యమంతోనే గ్రామాల్లో ప్రశ్నించేతత్వం ఏర్పడింది. దోపిడీ, అణచివేత, నిరుద్యోగ సమస్య ఇప్పటికీ మారలేదు.

ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి?

ప్రసాదరావు: అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అణచివేత ఉన్నన్ని రోజులు ఉద్యమాలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అది తుపాకీ ద్వారానే రావాలనే సిద్ధాంతమేమీలేదు.. ఏ రూపంలోనైనా రావచ్చు.

ఆపరేషన్‌ కగార్‌తో నష్టం వాటిల్లుతుందా?

ప్రసాదరావు: భారీగా నష్టం వాటిల్లుతుంది. అనారోగ్యం, పార్టీ సంక్షోభం తలెత్తుతుంది. నేను బయటకు వచ్చాక నా సహచరుడు సత్యనారాయణరెడ్డి ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

గిరిజన ప్రాంతాల్లో మీరుచేసిన సేవలు?

ప్రసాదరావు: వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో గిరిజన, లంబాడీల్లో చైతన్యం రగిలించా. వందల ఎకరాల సాగుభూములు పంపిణీ చేశాం. పాలకులు మారినా వారిజీవితాలు మారలేదు.

ఎక్కడ ఉంటున్నారు?

ప్రసాదరావు: హైదరాబాద్‌, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లోని బంధువుల వద్ద ఉంటున్నా. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. భవిష్యత్‌ నిర్ణయం తీసుకోలేదు.

తెలంగాణపై కామెంట్‌?

ప్రసాదరావు: సుమారు 1,200 మంది బలిదానాలు చేశారు. సబ్బండవర్ణం ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగ సమస్య అలాగే ఉంది.

కమ్యూనిజం నిర్మూలన సాధ్యమేనా?

ప్రసాదరావు: కమ్యూనిజం నిర్మూలన సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కొనసాగుతూనే ఉంది. తుపాకీ పక్కన పెట్టొచ్చు కానీ.. అంతం ఉండదు. ఉద్యమంలో నష్టం ఉండొచ్చు. బతికినా, చచ్చిన కమ్యూనిస్టుగానే ఉంటా.

పునరావాసం కల్పించిందా?

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావసం కల్పిస్తుంది. కానీ, ఎక్కువ మందికి ఉండేందుకు ఇళ్లులేవు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి బట్టలు లేవు. చాలాఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇళ్లస్థలాలు, వ్యవసాయ భూమి ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement