అజాగ్రత్తతో అపాయం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సమాచారం
● సురక్షిత గమ్యస్థానమే లక్ష్యం
● అలైవ్ – అరైవ్‌పై పోలీసుల ప్రచారం
● ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
● రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి
గోదావరిఖని: అజాగ్రత్త, నిర్లక్ష్యం జీవితాంతం విషాదం మిగుల్చుతోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ప్రాణాలు తీస్తోంది. ప్రధానంగా తెల్లవారుజామున సాగే ప్రయాణాలు ప్రమాదాలకు అత్యధిక కారణాలవుతున్నాయి. ఈనేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రణ, ప్రయాణికులు, వాహనదారులు క్షేమంగా గమ్యం చేరాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలోని పోలీసుశాఖ ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. రాష్ట్ర పోలీసుశాఖ ఆదేశాల మేరకు అలైవ్ – అరైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది. పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో వాహనదారులు, ఆటోడ్రైవర్లు, ఉద్యోగులతో సమావేశమై తరచూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది.
బ్లాక్‌స్పాట్ల పరిశీలన
జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించిన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఇటీవల బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించారు. ప్రమాదాలకు గల కారణాలపై నివేదిక తెప్పించుకున్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఈక్రమంలో వాహనాల తనిఖీ విస్తృతంగా చేపట్టింది. వాహన రిజిస్ట్రేషన్ పేపర్లు లేనివారితోపాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తోంది. పట్టుబడి న వారిని కోర్టులో హాజరుపర్చి రూ.2వేల జరి మానా విధిస్తోంది. రెండోసారి మద్యం తాగి పట్టుబడితే కోర్టు రెండురోజుల జైలు శిక్ష విధిస్తోంది.
ప్రధాన కారణాలివే
స్వయం కృతాపరాధంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసుశాఖ గుర్తించింది. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మె ట్, సీట్‌బెల్ట్ వాడకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్‌లో మాట్లాడడం ఇందులో ప్రధానమైనవిగా పేర్కొంది. తొందరగా గమ్యం చేరాలనే ఆరాటంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
అవగాహన ర్యాలీలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలుతోపాటు రోడ్డు భద్రత సూచనలు పాటించాలని, క్షేమంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీలు, పాఠశాలల్లో రోడ్డు భద్రత గురించి వివరిస్తున్నారు. ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు.
ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు
2022 127 53 262
2023 113 65 300
2024 145 57 342
2025 137 38 388
అజాగ్రత్తతో అపాయం


