పల్లెల పరిశుభ్రతే లక్ష్యం
● నేటి నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
పెద్దపల్లి: పల్లెలు శుభ్రంగా ఉండడం లక్ష్యంగా సోమవారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటింటా తప్పకుండా తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం, తాజా మాంసాహారం, కూరగాయలు, నిత్యావరాలు విక్రయించేలా చూడడంతోపాటు ఖాళీ స్థలాల్లో చెత్త వేకుండా చూడడం, ప్లాస్టిక్ కవర్లు వేయకుంఆ చర్యలు తీసుకోవడం, పిచ్చిమొక్కలు తొలగించడం లాంటి పనులు చేపడతారు. ఇంటింటికీ సురక్షిత నీరు అందించేందుకు వీలుగా ఈనెల 14వ తేదీన తాగునీటి పైపులైన్లు పరిశీలిస్తారు. అంతేకాదు.. పైపులైన్ల లీకేజీలు అరిక్టడం, ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు శుభ్రం చేయడంతోపాటు ఆస్తిపన్ను, లైసెన్స్ ఫీజు వందశాతం వసూలు చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే ఈనెల 16న పౌర సేవలు అందిస్తారు. 17న విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తారు. వీటన్నింటినీ కొత్త పంచాయతీ పాలకవర్గాలతోనే చేయిస్తారు. ఈమేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.


