గోల్‌మాల్!
అసలేం జరిగిందంటే..?
అడిషనల్ సెక్రటరీ పోస్టుల్లో అక్రమాల ఆరోపణలు
అర్హులను కాదని ఇతరులకు పోస్టింగ్‌లు
ప్రమోషన్లలో ప్రిన్సిపాళ్లకు తీరని అన్యాయం
సెంట్రల్ ఆఫీస్ వారికేనా అని సిబ్బంది ఆగ్రహం
గురుకులం పదోన్నతుల్లో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
గురుకులాల డిప్యూటీ సెక్రటరీ పోస్టుల విషయంలో గోల్‌మాల్ చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతుల విషయంలో ఉన్నతాధికారులు నిబంధనలు పట్టించుకోలేదని, నచ్చినవారికి పదవులు కట్టబెట్టారని, పైరవీలదే పైచేయి అయిందని సిబ్బంది అంటున్నారు. అధి కారులు ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరుకు తాము జీవితకాలం నష్టపోవాల్సి వచ్చిందని గురుకులాల సీనియర్ ప్రిన్సిపాల్స్ వాపోతున్నారు.
రోజులు గడిచినా..
నవంబర్‌లో జరిగిన సెక్రటరీ రివ్యూ మీటింగ్‌లో హామీ ఇచ్చి.. పదిరోజుల్లో ప్రమోషన్స్ భర్తీ చేస్తామన్న మినిట్ సర్క్యులర్ రిలీజ్ చేసినప్పటికీ రోజులు గడిచినా ఇప్పటికీ ఇవ్వలేదని, రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తే అక్రమంగా ఇచ్చిన పదోన్నతుల బాగోతం బయటపడుతుందని ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లతో నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోధనా అనుభవం, క్షేత్రస్థాయిలో గురుకులాల నిర్వహణపై అవగాహన లేని ప్రధాన కార్యాలయ సిబ్బంది కీలక పోస్టుల్లో అక్రమంగా కొనసాగుతుండటం ద్వారా గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారై నిరంతరం ఏదో సమస్య వేధిస్తోందని విమర్శిస్తున్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు కల్పించి బాధ్యతలు అప్పగిస్తే.. అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.
వెలుగుచూసిందిలా..
అడ్వకేట్ వీ.రాజేశ్వరరావు ఈ అంశంపై పోరాటం చేస్తున్నారు.నాలుగు నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా సాంఘిక సంక్షేమ గురుకులం సెక్రటరీని ప్రశ్నించగా.. 15 రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. అర్హత లేకున్నా.. ముగ్గురు అసిస్టెంట్లకు డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోషన్స్ ఇచ్చి.. రెగ్యులర్ ప్రిన్సిపాళ్లకు వాళ్ల అవకాశాలను దూరం చేశారు. ఇలా చేయడం ద్వారా గతంలో ముగ్గురు ప్రిన్సిపాళ్లు నష్టపోగా.. ఇప్పుడు వచ్చే మార్చి, ఏప్రిల్‌లో రిటైర్డ్ కానున్న ప్రిన్సిపాళ్లు పదోన్నతి బెన్‌ఫిట్స్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గురుకులాల సొసైటీ ఇటీవల పలు డిప్యూటీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేసింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం బోధన సిబ్బంది (ప్రిన్సిపాల్ గ్రేడ్–1)కి ఇవ్వాల్సిన ఆ పోస్టులను అక్రమంగా ప్రధాన కార్యాలయంలోని బోధనేతర సిబ్బందికి కట్టబెట్టారని ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకులం సొసైటీలోని ఆరు డిప్యూటీ సెక్రటరీ పోస్టుల్లో నిబంధనల ప్రకారం మూడుపోస్టులు ప్రిన్సిపాల్ గ్రేడ్–1కు ఒకటి, హెడ్ ఆఫీస్‌లోని బోధనేతర సిబ్బంది అయిన అసిస్టెంట్ సెక్రటరీకి రెండు పోస్టులను డిప్యూటేషన్‌పై ఇతర డిపార్ట్‌మెంట్ల నుంచి తీసుకోవాల్సి ఉంది. కానీ.. మొత్తం నాలుగు డిప్యూటీ సెక్రటరీ పోస్టులను హెడ్ ఆఫీస్‌లోని బోధనేతర సిబ్బందికి కట్టబెట్టి నిబంధనలు ఉల్లంఘించారని, తద్వారా గ్రేడ్–1 ప్రిన్సిపాల్స్‌కు అన్యాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అన్యాయమని నిలదీసిన తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వాపోతున్నారు. అంతేకాకుండా తమకు పదోన్నతులు ఇవ్వకుండా ఆపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పదోన్నతిలో భాగంగా భర్తీ చేసే సుమారు 8కి పైగా జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ కో–ఆర్డినేటర్ పోస్టులు ఏడాదికిపైగా ఖాళీగా ఉన్నా.. అర్హులకు ఇవ్వకుండా అక్రమార్గంలో తమ వారిని ఇన్‌చార్జి పేరిట అందలం ఎక్కించి కాలం గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్హత లేని జూనియర్ ప్రిన్సిపాల్‌కు ఇన్‌చార్జి జాయింట్ సెక్రటరీ పదవి, ఫిజికల్ డైరెక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ సెక్రటరీ పదవిని ఇన్‌చార్జి రూపంలో కట్టబెట్టి నాలుగైదు నెలల్లో రిటైర్డ్ అవుతున్న తమకు ప్రమోషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సీనియర్ ప్రిన్సిపాల్స్ ఆరోపిస్తున్నారు.


