ఒకటా.. రెండా.. మానేరు దాటిందా?
మంథనిరూరల్: పెద్దపులి సంచారంపై రెండు జిల్లా ల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన పెద్దపులి.. 20 రోజులుగా అటవీశాఖ అధికారులను ముప్పు తిప్ప లు పెడుతోంది. ఈనెల 15న పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి.. 28వ తేదీ వరకు వివిధ అ టవీ ప్రాంతాల్లో సంచరించింది. మానేరు దాటి భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నా రు. ఇప్పటివరకు మానేరు దాటినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు జిల్లాల్లో సంచరిస్తున్నది ఒక్కటేనా? లేక మరొకటి కూడా ఉందా? అనే సందిగ్ధం నెలకొంది.
శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి ఈనెల 15న పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి రామగుండంలోని మేడిపల్లి శివారు ఓసీపీ డంప్ ప్రాంతంలో సంచరించినట్లు డీఎఫ్‌ఓ శివయ్య ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు రోజుల పాటు ఆ ప్రాంతంలోనే మకాం వేసిన పెద్దపులి.. ఈనెల 23న గోదావరినది దాటి అవతలివైపు వెళ్లినట్లు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రెండురోజులకే మళ్లీ..
పదిరోజులపాటు రామగుండం ఓసీపీల్లోనే మకాం వేసిన పెద్దపులి.. ఈనెల 23న మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరినది దాటిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నది దాటి వెళ్లిపోయిందని భావించిన నేపథ్యంలో మళ్లీ రెండురోజులకే జైపూర్, పౌనూరు, శివ్వారం మీదుగా ఎల్.మడుగు వద్ద ఖాన్‌సాయిపేట–ఆరెంద ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధికారులు అడుగులను గుర్తించారు. పులి అడుగులను అనుసరిస్తూ సుమారు 15 కిలోమీటర్లు వెళ్లిన అధికారులు.. భట్టుపల్లి ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించి సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరుసటి రోజున పులిజాడ కోసం అన్వేషించినా ఇప్పటివరకు ఫలితం లభించలేదు.
మానేరు తీరంలో గాలింపు..
భట్టుపల్లి అడవుల నుంచి ఎటువైపు వెళ్లిందోనని గాలిస్తున్న క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఓ ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరెంద, వెంకటాపూర్, అడవిసోమన్‌పల్లి మానేరు తీరం వెంట పులి అడుగులను గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోనికిరణ్, ఎండీ అఫ్జల్ అలీ, ఎఫ్‌బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్‌తో పాటు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మానేరు ఎక్కడి నుంచి దాటిందని గుర్తించేందుకు అడుగుల జాడల కోసం సోమవారం సైతం అన్వేషణ చేశారు.
ఒక్కటేనా.. మరొకటి వచ్చిందా?
పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎద్దుపై దాడిచేసిన పులి ఒక్కటేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించాలంటే మానేరు దాటాల్సి ఉంటుంది. అయితే పెద్దపులి ఎక్కడి నుంచి మానేరు దాటి ఉంటుందని అటవీ అధికారులు అడుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంథనితో పాటు ముత్తారం మండలాల్లోని మానేరు పరీవాహక ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల అన్వేషణ కొనసాగుతోంది.
ఒకటా.. రెండా.. మానేరు దాటిందా?


