పాఠశాలలకు స్వచ్ఛ అవార్డులు
పెద్దపల్లి: జిల్లాలోని 8 సర్కారు బడులకు స్వచ్ఛ పాఠశాలల అవార్డులు ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు జిల్లాస్థాయిలో అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశామన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, చేతులు శుభ్రం చేసేందుకు సౌకర్యాలు, పాఠశాలలు, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల ప్రవర్తన, అవగాహన, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన తదితర అంశాలపై ప్రతిభ చూపినందుకు పురస్కారాలు అందించామన్నారు. డీఈవో శారద, ఏఎంవో షేక్, సీఎంవో కవిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు
జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా 38 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక రూపొందించగా.. ఇప్పటివరకు 15,162 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు.
రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్లు నిషేధం
రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్ల ప్రయాణం నిషేధించామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే తొలిసారి రూ.5,000, రెండోసారి రూ.10,000 వరకు జరిమానా విధిస్తామని, మూడోసారి దొరికితే కేసులు నమోదు చేసి వాహనం సీజ్ చేస్తామన్నారు.
ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవాలి
స్వయం ఉపాధి కోసం ట్రాన్స్‌జెండర్లు వచ్చేఏడాది జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వివరాలకు 94408 52495 నంబరులో సంప్రదించాలని కోరారు.


