
దంచి కొట్టింది!
పొంగిపొర్లిన వాగులు, నిండుకుండలా ప్రాజెక్టులు
ముగ్గురు గల్లంతు, ఐదుగురిని రక్షించిన వైమానిక దళం
మరో మూడు రోజులు ముసురే: ఐఎండీ
ఎల్లంపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక పర్యటన
సిరిసిల్లలో సహాయ చర్యల్ని పర్యవేక్షించిన కేంద్ర సహాయ మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. కామారెడ్డిలో క్లౌడ్‌బరస్ట్‌తో సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ఉప్పొంగింది. వరుణ ప్రతాపానికి వాగులు, వంకలు, నదులు పొంగాయి. బుధవారం ఉదయమే మొదలైన వర్షం గురువారం మధ్యాహ్నం వరకు విరామం లేకుండా కురిసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలలో వర్షం ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా.. సిరిసిల్లపై అధికంగా కనిపించింది. సిరిసిల్ల జిల్లా నర్మాలలో వ్యక్తి గల్లంతు కాగా ఐదుగురిని భారత వైమానికదళం కాపాడింది. సిరిసిల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, విప్ ఆదిశ్రీనివాస్‌తో కలిసి దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద వివరాలుఅ డిగి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముగ్గురు గల్లంతు
భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు గల్లంతయ్యారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మరో వ్యక్తి ప్రమాదవశాత్తూ ఎస్సారెస్పీ కాలువలో శేఖర్‌రెడ్డి (34) పడిపోయాడు. కరీంనగర్‌లో చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో రహ్మన్ (21) చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా నర్మాలలో పంపుకాడి నాగయ్య (45) వరదలో కొట్టుకుపోయాడు. కరీంనగర్ లోయర్ మానేరు జలాశయాన్ని, మానకొండూరు చెరువులను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఇన్ ఫ్లో 55 వేల క్యూసెక్కులు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రాజెక్టులకు వరద పోటు..
ఎగువన కురుస్త్ను వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మిడ్‌మానేరు 17 గేట్లు ఎత్తి కిందికి 57వేల క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరుకు వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లికి 5,30,424 క్యూసెక్కుల నీరు వస్తుంటే..561,424 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
జగిత్యాలకు రెడ్ అలర్ట్, మూడురోజులు ముసురే
మరో మూడు రోజులు ఉమ్మడి జిల్లాలో చెదురు ముదురు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జగిత్యాలకు భారీ వర్ష సూచన ఉందని రెడ్ అలర్ట్ జారీ చేయగా, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ప్రజలు అవసరముంటే తప్ప బయటికి వెళ్లకూడదని స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లాలో కుండపోత కురిసింది. వేకువజాము నుంచే అతి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపారగా కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు అప్రకటిత కర్ఫ్యూను మరిపించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండగా శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్యలో ఎల్‌ఎండీ గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు ప్రకటించారు. జాలరులు, గొర్రెలు, పశువుల కాపరులు అటువైపు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా తిమ్మాపూర్ లో 17సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గంగాధరలో అత్యల్పంగా 2.6సెం.మీల వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కెపాసిటీ ప్రస్తుతం
ఎల్‌ఎండీ 58,611 24 టీఎంసీ 16.6 టీఎంసీ
ఎంఎండీ 57,564 27.5 టీఎంసీ 21.3 టీఎంసీ
ఎల్లంపల్లి 5,30,424 20 టీఎంసీ 14.5 టీఎంసీ

దంచి కొట్టింది!

దంచి కొట్టింది!