
పాత కార్యకర్తలను పట్టించుకోండి!
పదేళ్లలో మాపై పెట్టిన కేసులు ఇంకా ఎత్తేయలేదు నామినేటెడ్ పదవుల్లో మాకే ప్రాధాన్యమివ్వాలి ఉమ్మడిజిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి 80 శాతం పదవులు పాతవారికే ఇస్తామని మీనాక్షి నటరాజన్ హామీ
సాక్షిప్రతినిధి,కరీంనగర్/గంగాధర:
‘పదేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోశాం.. ప్రజ ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేశాం.. పార్టీ కోసం కేసులు భరించాం.. తీరా ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలు వలస రాగానే.. మాకు ప్రాధాన్యం తగ్గుతోంది.. దయచేసి దశాబ్దకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసిన కష్టాలు, కే సులు, పడ్డ అవమానాలను దృష్టిలో ఉంచుకుని పాత కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని కాంగ్రెస్ నాయకులు ముక్తకంఠంతో అన్నారు. సోమవారం గంగాధర మండలంలోని ఎల్‌కే గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు తమ మనసులోని భావాలను, ఆవేదనను టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వెళ్ల్లబోసుకున్నారు.
డిమాండ్లు.. విన్నపాలు..
హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబు మాట్లాడుతూ.. ‘జనహిత యాత్ర విజయవంతమైందని, సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని వారిని కలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెంటనే కార్యకర్తలకు పదవులిస్తే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. కార్యకర్తలు నామినేట్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారని, జగిత్యాల జిల్లాలో ప్రొటోకాల్ సమస్య రాకుండా చేయాలని కోరారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఒక్కో కార్యకర్తపై 40 నుంచి 50 కేసులు నమోదయ్యాయని, వీలైనంత త్వరగా వాటిని ఎత్తేయాలని కోరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసినవారిని కడుపులో పెట్టుకోవాలని, అవకాశమిస్తే కరీంనగర్‌లో కూడా సత్తా చూపిస్తామని అన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని బద్‌నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ.. మా పార్టీ నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేందుకు పాదయాత్రలు చేస్తామని, బీజేపీని బొందపెడతామని, రాహుల్‌ని ప్రధాని చేసే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పార్టీని అధికా రంలోకి తెచ్చిన కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. 80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని, కొత్తవారు తమను తాము నిరూపించుకోవాలని సూచించారు.
వసతి గృహంలో శ్రమదానం
గంగాధర మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో గంటన్నర సేపు మీనాక్షి నటరాజన్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్టల్ ఆవరణలో మట్టి పోయడంతో పాటు, మొక్కలు నాటారు. గోడలకు రంగులు వేసి, బాత్రూంలు శుభ్రం చేశారు. పాటలతో నాయకులు, కార్యకర్తలను ఉల్లాసపరిచారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.