
పరిహారం రాలె!
పత్తి, వరి పంటలను ముంచిన వరద గోదావరితీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం 30 ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి వంద ఎకరాలకు పైగా నీట మునిగిన వరి పంట
మంథనిరూరల్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు అన్నదాతలను నిండా ముంచాయి. వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం కన్నా.. వరదలు వచ్చి పంటలను దెబ్బతీశాయనే వేదనే రైతులను వెంటాడుతోంది. భారీ వర్షాలతో గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని వందల ఎకరాల్లో వివిధ పంటలను వరదముంచెత్తింది. ఇందులో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు.
వంద ఎకరాలకు పైగా..
మంథని మండల వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో సుమారు ఐదు వేల నుంచి దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పత్తి, సుమారు 15 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని అంచనా. తొలకరితో పంటలు వేసిన రైతులకు భారీ వర్షాలు తీవ్రనష్టం తెచ్చిపెట్టాయి. ప్రధానంగా గోదావరి వరదకు వంద ఎకరాలకు పైగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
పరీవాహక ప్రాంతాల్లోనే నష్టం..
గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఉప్పట్ల, విలోచవరం, పోతారం, ఖానాపూర్, ఖాన్‌సాయిపేట పరిధిలోని వివిధ పంటలు వరదనీటిలో మునిగాయి. పోతారం గ్రామంలో అత్యధికంగా పత్తి దెబ్బతినగా, ఖానాపూర్, ఖాన్‌సాయిపేట, విలోచవరం గ్రామాల్లో వరి పంటపంట నీట మునిగింది. అ యితే వరద తాకిడితో పత్తికి భారీ నష్టం జరిగిందని, వరి కూడా దెబ్బతిందని రైతులు చెబుతున్నారు.
పరిహారం అందించాలని..
వేలాది రూపాయిల పెట్టుబడితో సాగు చేసిన పంటలను వరదలు ముంచెత్తాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు పత్తిపంటకు ఎకరాకు రూ.35 వేలు, వరి పంటకు రూ.25వేల వరకు పెట్టుబడిపెట్టామని చెబుతున్నారు. కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతుకు మరో రూ.20వేలు అదనంగా ఖర్చు అవుతోంది. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పరిహారం రాలె!

పరిహారం రాలె!