కల్తీ కల్లు కలకలం..? | - | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు కలకలం..?

Jan 19 2024 12:44 AM | Updated on Jan 19 2024 12:44 AM

గతంలో ఎకై ్సజ్‌ శాఖ తనిఖీల్లో పట్టుబడిన కల్తీకల్లు, కెమికల్స్‌
 - Sakshi

గతంలో ఎకై ్సజ్‌ శాఖ తనిఖీల్లో పట్టుబడిన కల్తీకల్లు, కెమికల్స్‌

సాక్షి, పెద్దపల్లి: రామగుండం పరిధిలో 41 కల్లు విక్రయ కేంద్రాలున్నాయి. గోదావరిఖని ఇందిరానగర్‌లోని కల్లు డిపోలో బుధవారం ఇద్దరు వ్యక్తులు కల్లు తాగి సమీపంలోని రోడ్డుపై పడిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ చనిపోయారు. వీరి మృతికి తాగిన కల్లు కారణమా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు డిపోను అధికారులు సీజ్‌ చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌ను పంపించగా, మృతిచెందిన వారి పోస్టుమార్ట్‌ం రిపోర్టు వచ్చిన తర్వాతే కారణాలు తెలవనున్నాయి. అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతం కార్మికుల క్షేత్రం. కొందరు కార్మికులు పొద్దంతా పనిచేసి సాయంత్రం ఉపశమనం కోసం కల్లు సేవిస్తుంటారు. గతంలో సైతం కల్తీకల్లుతో ప్రాణాలు పోయిన ఘటనలున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్తీ కల్లుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో కల్తీ కల్లులో ప్రధానంగా వాడే మత్తు పదార్థాల సరఫరాపై నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. మత్తు మందును సరఫరా చేసేవారిని ఎకై ్సజ్‌ పోలీసులు పట్టుకొని పెద్దమొత్తంలో ముడి సరుకును స్వాధీనం చేసుకున్న ఘటనలున్నాయి. దీంతో కొద్దిరోజుల పాటు కల్తీ కల్లు వ్యాపారం తగ్గింది. అధికారుల పర్యవేక్షణ కరువై ఇటీవల ఈ దందా జోరుగా సాగుతోంది.

నిఘా కరువు.. నమూనాల సేకరణ ఏదీ..?

జిల్లాలోని కల్లు దుకాణాలపై ఎకై ్సజ్‌ శాఖ నిఘా కరువవుతోంది. కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నా ఆయా ప్రాంతాల్లోని ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయాల అధికారులు శ్రీమాములుశ్రీగానే తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఎకై ్సజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేయాలి. నమూనాలను ప్రాథమికంగా పరీక్షించేందుకు అధికారుల వద్ద మినీ కిట్లు ఉంటాయి. కానీ, ఏదైనా ఘటనలు జరిగినప్పుడే హడావుడి చేసి పరీక్షలు చేస్తున్నారు. నిజానికి ఎకై ్సజ్‌ అధికారులు ఒక దుకాణంలో ఇష్టం వచ్చిన సీసాలోని కల్లునను శాంపిల్స్‌గా తీసుకోవాలి. వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. శాంపిల్స్‌ పంపియ్యాలని దుకాణం యజమానికి ఎకై ్సజ్‌ అధికారులే చెప్తున్నారు. దీంతో వారు స్వచ్ఛమైన కల్లును అధికారులకు పంపిస్తున్నారు. ఈక్రమంలో ప్రయోగశాలలో కల్లు కల్తీ అని నిర్ధారణ కావడం లేదనే ఆరోపణలున్నాయి.

కిక్కు కోసం..

10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్లు నీళ్లు కలుపుతారు. రామగుండం ప్రాంతాల్లో డిమాండ్‌కు సరిపడా ఈత చెట్లు లేవు. 5శాతం మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తున్నారు. మిగిలిన 95శాతం కల్తీనే. వ్యవసాయ తోటల్లో ఎక్కడికక్కడ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని డైజోఫాం, క్లోరో హైడ్రెట్‌వంటి నిషేధిత పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. మొత్తం మిశ్రమాన్ని నీటి తొట్టెలో కలియ తిప్పుతారు. తీపి కోసం శాక్రిన్‌, నురగ కోసం అమ్మోనియం వంటి రసాయనాలను వాడుతారు. ఉదయం తయారు చేసిన మిశ్రమానికి ఈస్ట్‌ కలిపి సాయంత్రం వరకు పులియబెడుతారు. తర్వాత సీసాల్లో నింపి దుకాణాలకు చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గతంలో జరిగిన సంఘటనలు

● 2016 అక్టోబర్‌ 17న అప్పటి రామగుండం సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ప్రత్యేక ఆదేశాలతో వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్‌ సీఐ ఎస్‌.బాబా ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు చేశారు. కల్తీ కల్లుకు ఉపయోగించే అల్ఫోజం, క్లోరోఫామ్‌, కెమికల్స్‌, నురుగు రావడానికి కుంకుడు కాయలు, కల్లు చిక్కదనం కోసం కలిపే పేస్ట్‌, పులుపు కోసం సిట్రిక్‌ యాసిడ్‌, చాక్రిన్‌ పౌడర్‌ తదితర పదార్థాలను సీజ్‌ చేశారు.

● 2015 అక్టోబర్‌లో కల్తీ కల్లు కాటుకు చాలా మంది బలవ్వడంతో అప్పటి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దీంతో అధిక మత్తు కలిగిన కల్లుకు బ్రేక్‌ పడింది. అధిక మత్తు కల్లుకు అలవాటుపడిన బాధితులకు నిషా లేని కల్లు మాత్రమే దుకాణాల్లో లభ్యం కావడంతో దాన్ని తాగాలేక కొందరికి ఫిట్స్‌ రాగా, ఇంకొందరు మానసిక సమస్యలతో వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రులపాలయ్యారు. గోదావరిఖనిలో వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరగా, ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు.

కల్లు డిపో డైరెక్టర్‌పై కేసు

గోదావరిఖని(రామగుండం): కల్లు తాగి ఇద్దరు మృతి చెందిన కేసులో అడ్డగుంటపల్లికి చెందిన నంబర్‌వన్‌ కల్లుడిపో డైరెక్టర్‌ వంగ శ్రీనివాస్‌పై గురువారం కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. బుధవారం కల్లు తాగి మామిడి రమేశ్‌, నాంపల్లి నవీన్‌ మృతిచెందారు. రమేశ్‌ కుమారుడు అవినాష్‌ ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు మిగతా డైరెక్టర్లు, సొసైటీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

జిల్లాలో కల్లు దుకాణాలు ఇలా..

పెద్దపల్లిలో 63

సుల్తానాబాద్‌ 46

రామగుండం 41

మంథని 42

ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ కల్లు

ప్రాణాంతక మత్తుపదార్థాలతో పలువురు వ్యాపారుల తయారీ

కల్తీ కల్లుతో చిత్తవుతున్న ప్రజలు

దుకాణాలు, డిపోలపై ఎకై ్సజ్‌, పోలీస్‌శాఖ నిఘా కరువు

శాంపిళ్లు సేకరించాం

తెల్లకల్లు దుకాణం నుంచి శాంపిళ్లు సేకరించి షాపు సీజ్‌ చేశాం. 15రోజుల్లో నివేదిక వస్తుంది. ఇక నుంచి రోజూ కల్లు దుకాణాలను తనిఖీ చేసి శాంపిళ్లు సేకరిస్తాం. తాజా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నాం. కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– రమేశ్‌, గోదావరిఖని ఎకై ్సజ్‌ సీఐ

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement