జెడ్పీ ఆవిర్భవించిన తర్వాత
తొలిసారిగా ఎన్నికలు
నేడు ఉదయం 7 నుంచి పోలింగు
15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
పట్టణ పోరు ముగిసింది. ఎన్నికల ఫీవర్ మండలాలకు తాకింది. ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధమైంది. బరిలో ఉన్న అభ్యర్థులు అమీతుమీకి సై అంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ ప్రాతిపదికన తొలిసారిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగు ప్రారంభమవుతుంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
6,43,874 మంది ఓటర్లు
జిల్లాలో మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు 540 మంది బరిలో ఉన్నారు. మొత్తం 6,43,874 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,14,899 మంది పురుషులు, 3,28,910 మంది మహిళలు, 65 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి విధులు, బాధ్యతలపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు అందించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి ఆయా మండలాలకు చేరుకున్నాయి. వీటితోపాటు.. విధుల్లో పాల్గొనే సిబ్బంది తమకు కేటాయించిన పోలింగు కేంద్రాలకు బుధవారం ప్రయాణమయ్యారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుండగా.. 15 మండలాల్లో 799 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికోసం ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


