అర్ధశతాబ్దపు నిరీక్షణ..! | - | Sakshi
Sakshi News home page

అర్ధశతాబ్దపు నిరీక్షణ..!

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

పార్వతీపురం రూరల్‌: ఎన్నికల వేళ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని, ఆయకట్టుకు నీళ్లందిస్తామని పలికిన ప్రగల్భాలు అధికార పీఠం ఎక్కగానే నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అరశతాబ్దపు సుదీర్ఘ నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందని ఆశించిన జంఝావతి ఆయకట్టు రైతుల ఆశలపై కూటమి పాలకుల నిర్లక్ష్యం మరోసారి నీళ్లు చల్లుతోంది. త్రిముఖంగా మిత్రపక్ష ప్రభుత్వాలే ఉన్నా.. పాలకుల్లో చలనం లేకపోవడం, ఇచ్చిన హామీలను గాలికొదిలేయడంపై ఉత్తరాంధ్ర రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

హామీలు ఇచ్చారు.. పట్టించుకోవడం మరిచారు..

కేంద్రంలో, పొరుగున ఉన్న ఒడిశాలో, అలాగే రాష్ట్రంలోనూ ఒకే కూటమి అధికారంలో ఉంది. ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని, ముఖ్యమంత్రి స్థాయిలో చొరవ తీసుకుంటే దశాబ్దాల అంతర్రాష్ట్ర వివాదం ఇట్టే పరిష్కారమవుతుంది. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ నాయకత్వం జంఝావతి ఊసే ఎత్తడం లేదు. ఉత్తరాంధ్రకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు సైతం ఈ అంతర్రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించి, ప్రాజెక్టుకు నిధులు రాబట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం ప్రభుత్వం ఉదాసీనతకు అద్దం పడుతోంది.

ఒడిశాతో తేలని పంచాయితీ

జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండాలంటే ఒడిశా పరిధిలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. భూసేకరణ, పరిహారం వ్యవహారంపై సరైన చొరవ చూపకపోవడంతో వివాదం మొదటికొస్తోంది. పూర్తిస్థాయి డ్యామ్‌ నిర్మాణం లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యామ్‌తో కేవలం 0.6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ అవుతోంది. ప్రాజెక్టు అసలు సామర్థ్యం 4 టీఎంసీలు కాగా, సరిహద్దు వివాదాలతో అపారమైన జలసంపద వృథా అవుతోంది.

చుక్కనీరు లేక.. వలస బాటలో పల్లెలు

ప్రాజెక్టు పరిధిలోని 23 కిలోమీటర్ల ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూడికతో నిండిపోయాయి.

పరిష్కారానికి అవకాశం ఉంది

కేంద్రం, ఏపీ, ఒడిశాలో అనుకూల ప్రభుత్వాలున్నాయి. ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని 1,175 ఎకరాల భూసేకరణ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మిస్తే రైతులకు కొంత సాగు నీటికి ఆసరాగా ఉంటుంది.

– మాలతి కృష్ణ మూర్తి నాయుడు/

చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు

కాలువలు బాగుచేస్తే.. వలసలు ఆగుతాయి..

ప్రాజెక్టు కాలువలు పూడికలతో నిండిపోయాయి. చుక్క నీరు రాక 25 వేల ఎకరాల ఆయకట్టు బీడువారుతోంది. పచ్చని పొలాలు ఎండిపోతుంటే తట్టుకోలేక మా పిల్లలు పట్టణాలకు వలసపోతున్నారు. యుద్ధప్రాతిపదికన కాలువల ఆధునికీకరణ చేపట్టి, చివరి ఎకరాకూ నీరు అందిస్తే మా సొంతూళ్లలోనే వ్యవసాయం చేసుకుని బతుకుతాం.

– పల్లె రాజగోపాల్‌ నాయుడు/

జంఝావతి సాధన సమితి సభ్యుడు

నిర్లక్ష్యంతో రబ్బరు డ్యామ్‌తో ప్రయోజనం శూన్యం

పాలకుల నిర్లక్ష్యంతో రబ్బరు డ్యామ్‌తో కేవలం 0.6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ అవుతోంది. అసలు సామర్థ్యం 4 టీఎంసీలున్నా ముంపు సమస్యల వల్ల పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. ఒడిశాతో చర్చలు ముగించి పరిహారం చెల్లిస్తే.. ప్రాజెక్టు కల సాకారమవుతుంది. జంఝావతి స్వచ్ఛమైన జలాలు మాకందించాలి.

– నెల్లి లక్ష్మునాయుడు /రైతు పెదగుడబ

నిధులు కేటాయించి ఆదుకోవాలి..

44 రోజులుగా మేము దీక్షలు చేస్తోంది పదవుల కోసం కాదు. రైతుల పొలాలకు నీటి కోసమే. ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లుగానే.. జంఝావతి పెండింగ్‌ డీప్‌కట్‌ పనులకు, ఒడిశా పరిహారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. ఈ ప్రాంత రైతుల కన్నీటి వ్యథను అర్థం చేసుకుని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి.

– చుక్కా పారినాయుడు/

రైతు, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు

దశాబ్దాలుగా మరమ్మతులు లేక అధ్వానంగా మారడంతో ఉన్న కొద్దిపాటి నీరు కూడా చివరి ఆయకట్టుకు చేరడం లేదు. ఫలితంగా పార్వతీపురం, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాల్లోని 25 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే ఎండిపోతూ..ఉపాధి కరువవడంతో ఈ ప్రాంత యువత, రైతులు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

ప్రభుత్వం మేల్కోవాలి

జంఝావతి పెండింగ్‌ డీప్‌ కట్‌ పనులకు, ఒడిశా పరిహారానికి రూ.250–300 కోట్లు ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతోందని అన్నదాతలు నిలదీస్తున్నారు. 75 గ్రామాల రైతులు ఏకమై 44 రోజులుగా పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ‘జంఝావతి సాధన దీక్షలు’ చేస్తున్నా పాలకుల గుండె కరగకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఒడిశాతో చర్చలు ముగించి కాలువల ఆధునికీకరణ, డ్యామ్‌ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

44 రోజుల ఆక్రందన

75 గ్రామాల గోడు..

కుటమి పాలకుల చెవికి ఎక్కేదెన్నడు?

సాగునీటికి ఉరికొయ్యగా సరిహద్దు పంచాయితీ..

జిల్లాలో మండుతున్న జంఝావతి సాధన నిరసన సెగలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement