భామిని: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థి కేవటి రంజిత్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు స్కూల్ హెచ్‌ఎం ఆబోతుల మల్లేశ్వరరావు, పీఈటీ అలికాన శంకర్‌రావులు బుధవారం తెలిపారు. ఈనెల 2,3 తేదీలలో కర్నూలులో జరిగిన 70వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎస్‌జీఎఫ్‌ఐ 2026–27 అథ్లెటిక్స్ అండర్–17 స్టేట్ మీట్ జరిగింది.ఆ పోటీలలో లాంగ్ జంప్ విభాగంలో భామిని విద్యార్థి కేవటి రంజిత్ సిల్వర్ మెడల్ సాధించాడని చెప్పారు. ఈ మేరకు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు.
పర్యావరణ పరిరక్షణపై
200 మంది విద్యార్థుల ప్రతిజ్ఞ
విజయనగరం అర్బన్: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ, సుస్థిర జీవన విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో సీతం కళాశాల జాతీయసేవా పథకం ఆధ్వర్యంలో బుధవారం బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వీక్–2026 కార్యక్రమం నిర్వహించారు. మిషన్ లైఫ్ స్ఫూర్తితో 200 మందికి పైగా విద్యార్థులు పర్యావరణహిత జీవనశైలిని అలవరుచుకుంటామని సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. నీరు, విద్యుత్, పొదుపు, వ్యర్థాల తగ్గింపు, ఈ–వేస్ట్ నియంత్రణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. జేఎన్‌టీయూ గురజాడ ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా నోడల్ అఽధికారి డాక్టర్ ఎన్.సతీష్‌కుమార్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ఆంగ్ల విభాగ అధ్యాపకుడు కె.వెంకటేశ్వరరావు పాల్గొని పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు.
వ్యాన్‌ను ఢీకొట్టి యువకుడి మృతి
గజపతినగరం రూరల్: విధులకు హాజరయ్యేందుకు విశాఖపట్నం వెళ్తున్న ఓ యువకుడు వెనుక నుంచి వ్యాన్‌ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున మండలంలోని మరుపల్లి జంక్షన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలం మీసాలపేట గ్రామానికి చెందిన గంట్యాడ రోహిత్ కుమార్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.30 గంటల సమయంలో విధుల నిమిత్తం బైక్‌పై విశాఖపట్నం వెళ్తుండగా మరుపల్లి జంక్షన్ సమీపంలోని రైస్ మిల్లు వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన టాటా వింట్రా వ్యాన్‌ను ఢీకొన్నాడు. వ్యాన్‌కు రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపై నిలిపి ఉంచడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రోహిత్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్‌న్స్‌లో గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ
● పార్వతీపురం మండలంలో 57 కేంద్రాల ఏర్పాటు
● నిర్భయంగా ఓటుహక్కు
వినియోగించుకోవాలి
డీఆర్డీఏ పీడీ ప్రభావతి
పార్వతీపురం రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి బుధవారం పంపిణీ చేశారు. పార్వతీపురం మండలాన్ని 4 జోన్లు, 7 రూట్లుగా విభజించి మొత్తం 57 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి (పీడీ) ప్రభావతి పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు నలుగురు ఇతర సిబ్బందిని (ఓపీఓలు) నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ నమోదు చేస్తున్నట్లు పీడీ స్పష్టం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రతను పెంచి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి అపోహలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గొడవలు జరగకుండా చూడండి
డెంకాడ: పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులకు నియమించిన పోలీసులతో ఆయన బుధవారం సమావేశమై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండేలా చూడాలని, ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా తగాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.


