పాలకొండ రూరల్: ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన పరిషత్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేలా పచ్చమూకలు బరితెగించాయి. వైఎస్సార్ సీపీకి చెందిన వారిని కవ్వించేందుకు, దాడులు చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. పాలకొండ మండలం పణుకువలస ఎంపీటీసీ స్థానం బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి టి.కల్పన తరపున ఎన్నికల ఏజెంట్‌గా శివ్వాల సత్యంనాయుడిని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఈ క్రమంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సదరు ఏజెంట్‌తో పాటు మరికొందరు బుధవారం సాయంత్రం టీసీ పరిధిలో టీడీ పారాపురం పోలింగ్ కేంద్రంలో అధికారులకు అందించేందుకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో కాపుకాసిన టీడీపీ మూకలు వారికి అడ్డుపడ్డాయి. తమ గ్రామంలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు అడుగుపెట్టవద్దంటూ, బూతులు తిడుతూ దాడిచేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు చెందిన కారును ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ మూక దాడిని అక్కడి పోలీసులు గమనించి అడ్డుకున్నారు. కేవలం ఓటమి భయంతో ఈ తరహా దాడులు చేయడం అన్యాయమని, పరిస్థితి ఇలానే ఉంటే నేటి పోలింగ్ పరిస్థితి ఏమిటని వారు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. అక్కడి నుంచి పాలకొండ వచ్చిన బాధితులు సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.వైకుంఠరావు, ఎంపీడీఓ బి.రామకృష్ణతోపాటు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.


