విజయనగరం టౌన్: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పనుల పురోగతిని దక్షిణ తీర రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ బుధవారం స్వీయ పర్యవేక్షణ చేశారు. మౌలికసదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, కార్యాచరణ, భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. విశాఖపట్నం, విజయనగరం, కంటకాపల్లి సెక్షన్లలో విస్తృతమైన తనిఖీలు చేశారు. డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు, లైన్ సామర్థ్యం, సురక్షితమైన రైలు కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనంతరం బొబ్బిలి రైల్వేస్టేషన్, యార్డ్ తనిఖీ చేసి, స్టేషన్ సౌకర్యాలు పరిశీలించారు. ఉద్యోగుల సంక్షేమంకోసం బొబ్బిలి రైల్వేస్టేషన్లో కొత్తగా నిర్మించిన మహిళా సిబ్బంది విశ్రాంతి గదిని మహిళా ఉద్యోగితో ప్రారంభించారు. గొట్లాం బైపాస్ రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతిని, అనుబంధ మౌలిక సదుపాయాలను సమీక్షించారు. కంటకాపల్లిలో ప్రతిపాదిత కొత్త రైల్వే సైడింగ్ పనులను సమీక్షించి అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రైలు ఆధారిత సరుకు రవాణాను బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు, వస్తువుల నిరాటంకమైన రవాణాను సులభతరం చేయడంపై దృష్టిసారించి, ప్రాజెక్ట్ పురోగతి, మౌలిక సదుపాయాల అవసరాలు, కార్యాచరణ సమన్వయంపై చర్చలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్కే రాజ్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్, టెలికం ఇంజినీర్ ఓబీ సురేష్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్ కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అంకుష్ గుప్త, విజయనగరం రైల్వేస్టేషన్ మేనేజర్ ఎస్బీవీ రావు తదితరులు పాల్గొన్నారు.


