● మక్కువలో హోరెత్తిన ప్రచారం
● వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
మక్కువ: పార్టీ అధికారంలో ఉన్నా..లేకున్నా..నిరంతరం ప్రజాసేవకే మాజీవితం అంకితమని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకుడు మావుడి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మావుడి తిరుపతినాయుడు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రం మక్కువలో మంగళవారం మక్కువ–1, 2 ఎంపీటీసీ అభ్యర్థులు మావుడి రామలక్ష్మి, గొండేడ రమణమ్మలకు మద్దతుగా వేలాదిగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మక్కువలోని అన్ని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మావుడి సోదరులు మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నామని, పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు కొత్తగా పుట్టుకొస్తున్న నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఓటు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటివారిని నమ్మి మోసపోరాదని హితవు పలికారు. గడిచిన ఐదేళ్లలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించామని, అర్హులైన ప్రతి పేదవాడికీ పెన్షన్ అందించామన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒకరికై నా ఇల్లు, పెన్షన్ అందించారా? అని ప్రశ్నించారు. పేదల పక్షాన నిలబడే నిజమైన నాయకులకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి మహిళకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు.


