కొమరాడ: మండల రైతులకు గజరాజుల భయం మళ్లీ మొదలైంది. ఇటీవల పార్వతీపురం మండలంలో సంచరించిన గజరాజుల గుంపు సోమవారం అర్ధరాత్రి కొమరాడ మండలంలోకి ప్రవేశించింది. విక్రంపురం, అంకులవలస, సుందరాపురం తదితర గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో గజరాజుల సంచారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రిపూట ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తాయేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏనుగుల సంచారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మళ్లీ గజరాజుల గుంపు రావడం ఆందోళన కలిగిస్తోంది.
కుంకీ ఏనుగులతో కానరాని ప్రయోజనం
గజరాజుల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ప్రయోజనం కలగడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారాన్ని నియంత్రించడంలో అటవీ శాఖ అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గజరాజులు సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పంటలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి గజరాజుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
రైతుల గుండెల్లో గుబులు
కుంకీ ఏనుగులతో ప్రయోజనం ఏదీ?
అటవీ శాఖ స్పందించాలని రైతుల డిమాండ్


