పోలింగ్‌ మరుసటి రోజు ఆన్‌డ్యూటీ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ మరుసటి రోజు ఆన్‌డ్యూటీ ఇవ్వాలి

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

పోలింగ్‌ మరుసటి రోజు ఆన్‌డ్యూటీ ఇవ్వాలి ● రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన తల్లిడిల్లిన మనసు ● తనయుడికి తలకొరివి పెట్టిన అమ్మ

పార్వతీపురం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు ’ఆన్‌ డ్యూటీ’ సౌక ర్యం కల్పించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామల సింహాచలం కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ఎన్నికల కమిషన ర్‌ పుణేఠాకు విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 4, 5 తేదీల్లో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. 5వ తేదీన పోలింగ్‌ ముగిసిన అనంత రం బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని రిసెప్షన్‌ కేంద్రాల్లో అప్పగించే ప్రక్రియకు రాత్రంతా సమయం పడుతోందని పేర్కొన్నారు. దీనివల్ల సిబ్బంది శారీరక, మానసిక అలసటకు గురవుతున్నారని తెలిపారు. సుదూర ప్రాంతా ల నుంచి రవాణా సౌకర్యాలు లేక, మరుసటి రోజు ఉదయం పాఠశాలలకు చేరుకోవడం ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారుతోందని వివరించారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సిబ్బందికి ఆన్‌ డ్యూటీ కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్ర పరిసరా ల్లో ఉన్న డా.వైఎస్సార్‌ ఉద్యానవన కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాట్లను పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ బాక్సుల భద్రత, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట నిఘా, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ టీవీ తిరుపతిరావు, వివిధ మండలాల ఆర్‌ఓలు పాల్గొన్నారు.

పాలకొండ రూరల్‌: నవమాసాలు కడుపున మోసి పెంచి పెద్ద చేసిన కొడుకు కళ్లముందే మరణించడంతో ఆ తల్లి పేగు తల్లడిల్లింది. నా అనేవారు ఎవరూ లేకపోవడం, ఆర్థికంగా చితికిపోవడంతో మరణించిన కుమారుడి అంత్యక్రియలు చేసేందుకు కూడా అవకాశం లేకపోయింది. దీంతో చుట్టుపక్కల వారి సహయంతో కుమారుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు చేర్చింది. బరువెక్కిన హృదయంతో రోదిస్తూ తనయుడికి తలకొరివి పెట్టింది ఆ తల్లి. ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. పాలకొండ నగర పంచాయతీ గేదెల వారి వీధిలో నివాసం ఉంటున్న టేకి శ్రీనివాసరావు(45) అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. మృతుడు శ్రీనివాస రావుకు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క తల్లి వెంకటమ్మ వృద్ధాప్యంతో బాధపడుతుంది. ఇది వరకే ఆమె భర్త చనిపోవడం, కుమారుడు కూడా అనారోగ్యం కారణంగా మూలనపడి మృత్యువాత పడడంతో ఆమె రోదన వర్ణనాతీతంగా మారింది. ఆర్థికంగా వెనకబడి ఉండడం, సొంతవారు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలకు సైతం అవస్థలు పడాల్సివచ్చింది. దీంతో స్పందించిన చుట్టుపక్కల వారు మానవత్వాన్ని చాటుకున్నారు. భోరున వర్షం పడుతున్నప్పటికీ మృతదేహాన్ని సంప్రదాయ బద్ధంగా శ్మశాన వాటికకు చేర్చారు. ఈ క్రమంలో ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తూ కుమారుడి మృతదేహానికి తలకొరివి పెట్టింది. ఈ ఘటనను చూస్తున్న వారంతా కళ్లు చెమర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement