మక్కువ: మండల కేంద్రం మక్కువకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీని వీడి సోమవారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు మూడు దశాబ్దాలుగా మక్కువకు చెందిన మావుడి పార్థసారథి, లింగం తారక రామారావు, కొండపల్లి గోపి తెలుగుదేశంలో ఉంటూ, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడుతో కలిసి పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమై, పార్టీలో చేరగా వారికి రంగునాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమంతా కలిసి పనిచేసి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేద్దామని రంగునాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


