ఆచార్యా ఇది మీకు తగునా..? | - | Sakshi
Sakshi News home page

ఆచార్యా ఇది మీకు తగునా..?

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడే చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బడిలో పిల్లలకు తల్లిదండ్రుల మాదిరిగా రక్షణగా నిలవాల్సిన గురువే వారి పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఫిర్యాదులు గరివిడి మండలంలోని గదబవలస గ్రామంలో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గరివిడి మండలం గదబవలస ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బాబ్జీపై..పలువురు చిన్నారి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జ్వరం కారణంగా ఓ చిన్నారి విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం వెలుగులోనికి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్ధినులను కూడా విచారణ చేయగా మరికొందరు చిన్నారులు సైతం తాకరాని చోట్ల చేతులు వేస్తున్నాడని తెలియజేశారు. ఈ విషయంపై గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో విచారణ

గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖాధికారి పి.రామారావుతో పాటు చీపురుపల్లి సీఐ జి.శంకరరావు, గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు గ్రామానికి చేరుకుని ఘటనపై గ్రామస్తులను కలిసి విచారణ చేశారు. స్కూల్‌లో చదువుతున్న చిన్నారులను కూడా ప్రశ్నించగా గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడు ఇలా చేతులు వేయడం, తాకరాని చోట గిల్లడం, పట్టుకోవడం చేస్తున్నారని చిన్నారులు అందరి సమక్షంలో చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికారులు గ్రామంలోనికి వెళ్లక ముందు చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు వెళ్లి ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా తప్పు అయిపోయిందని, మరెప్పుడూ ఇలా చేయనని, క్షమించమని ఆ ఉపాధ్యాయుడు అడిగారని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్న మాట.ఏది ఏమైనా సరే ఆ ఉపాధ్యాయుడిని విదుల నుంచి తొలగించాలని, ఏ పాఠశాలలో కూడా బోధన చేయకుండా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సదరు ఉపాధ్యాయుడు బాబ్జీపై సస్పెన్షన్‌ విధిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయమై ఎంఈఓ రామారావు మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు గ్రామంలోనికి వెళ్లి పిల్లలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడామని తెలిపారు. ఈ విషయంలో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ విధిస్తూ డీఈఓ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ విషయమై తదుపరి విచారణ చేపడతామని చెప్పారు. గ్రామస్థులు, పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హెచ్‌ఎం బాబ్జీపై ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేశారు.

చిన్నారులపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

గదబవలస ప్రాథమిక పాఠశాలలో కలకలం

ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర ఆరోపణలు

సస్పెన్షన్‌ విధించిన డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement