రామభద్రపురం: మండలంలోని ఆర్.చింతలవలసకు చెందిన ఓ వ్యక్తి పురుగు మందు తాగి అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుడుమూరు రాజేష్ ఇంటి సమస్యల కారణంగా మనస్తాపానికి గురై గత నెల 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం వెంటనే 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.అక్కడ చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చౌడేశ్వరిదేవి ఆలయంలో చోరీ
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి సంతమార్కెట్ ఆవరణలోని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఉన్న చౌడేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఎప్పటిలాగే అర్చకుడు యశ్వంత్ సోమవారం ఉదయం ఆలయానికి చేరుకుని తలుపులు తెరిచేందుకు సిద్ధం కాగా అప్పటికే తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి కమిటీ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అమ్మవారికి అమర్చిన బంగారు బొట్టు, కనుబొమ్మలు, కన్నులతో పాటు ఐదు నెలలుగా లెక్కించకుండా ఉన్న రెండు హుండీల్లోని నగదును దుండగులు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. అలాగే ఆలయం ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేసినట్లు గుర్తించి క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి ఆధారాలు సేకరించారు. కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కొఠియాలో హైటెన్షన్
● నేరెళ్లవలస వద్ద ఆంధ్రా రేషన్
సరుకుల లారీ అడ్డగింత
సాలూరు: ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఆంధ్రా స్థానిక సంస్థల ఎన్ని కల నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇప్పటికే ఒడిశా అధికారులు, ప్రత్యే క పోలీసు బలగాలతో ఆంధ్రా ఎన్నికలను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం కొఠియా గ్రూప్ గ్రామాలకు జీసీసీ ద్వారా ఆంధ్రా ఆధ్వర్యంలో ప్రతి నెలా అందించే రేషన్‌సరుకుల వాహనం నేరెళ్లవలస జీసీసీ డిపో వద్ద డంప్ చేయడానికి చేరుకున్న క్రమంలో ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి ఈ లారీని అడ్డుకున్నారు. దీనిపై ఆంధ్రా రెవెన్యూ అధికారులు పలువిధాలుగా నచ్చచెప్పి సరుకులను డంప్ చేసే ప్రయత్నం చేసినా ఒడిశా అధికారులు అంగీకరించలేదు. దీంతో అటు ఒడిశా పోలీసులు, ఇటు సాలూరు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రా పోలీసులు, తహసీల్దార్ సురేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలు సుకున్న కొఠియా గ్రూప్ గ్రామాలైన ఎగుశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, మూలతాడివలస, సా రిక, నేరెళ్లవలస తదితర గ్రామాల ప్రజలు సంఘటనా స్దలానికి చేరుకుంటున్నారు.రాత్రి సు మారు 10 గంటల సమయంలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రేషన్ సరుకుల లారీనే అడ్డుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కొఠియా గ్రామాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


