బలిజిపేట: మండలంలోని పదమాయవలసలో మాజీ సర్పంచ్ టి.సత్యంనాయుడుతో సహా 50కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో సోమవారం చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టి.సింహాద్రినాయుడు, పార్వతమ్మ, సీతమ్మ, పారమ్మతో పాటు 50కుటుంబాల వారు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆకలిమంటలతో అల్లాడిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి లేవన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవికుమార్, పార్టీ జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు పీఎస్‌ఆర్ నాయుడు, కె.మోహనరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


