● గిరిప్రదక్షిణ రహదారికి పొంచి ఉన్న ముప్పు
● రూ.3.40 కోట్ల రహదారికి ఆరు
నెలలకే గండం
● వర్షం ధాటికి ఏడు చోట్ల
కొట్టుకుపోయిన మట్టి
● ఈ రహదారిని వర్చువల్గా
ప్రారంభించిన పవన్ కల్యాణ్
● రహదారి భద్రతపై భక్తుల్లో ఆందోళన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరిప్రదక్షిణ రహదారికి ప్రమాదం పొంచి ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారి ఆరు నెలలు గడవకముందే దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారికి ఇరువైపులా వేసిన మట్టి సుమారు ఏడు ప్రాంతాల్లో కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రహదారి అంచులు బలహీన పడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థంలోని బోడికొండ చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు వీలుగా సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు నెలల కిందట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చువల్గా ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకే రోడ్డుకు ఇరువైపులా వేసిన మట్టి పలుచోట్ల కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. రహదారి నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మట్టి కొట్టుకుపోవడంతో రహదారి అంచులకు బలం తగ్గి నిర్మాణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అవసరమైన చోట్ల నీటి పారుదల ఏర్పాట్లు, మట్టి కోతను అరికట్టే రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. వర్షం ఎప్పుడు కురిసినా బోడికొండపై నుంచి వర్షం నీరు రహదారిపైకి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సమయంలో సంబంధిత అధికారులు నాణ్యతను ఏ మేరకు పరిశీలించారనేది ప్రశ్నార్థగా మారింది. ప్రస్తుతం కొట్టుకుపోయిన మట్టిని బలంగా పూడ్చడంతో పాటు భవిష్యత్తులో వర్షాలకు కోతకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత అధికారులు రహదారిని పరిశీలించి, నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి, మరమ్మతులు చేపట్టాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


