● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘బెల్లాన’
చీపురుపల్లి: దౌర్జన్యం, అరాచకం, దోపిడీ, అన్యాయంతో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు నాంది కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఆకుపేలపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో హామీలు ఇచ్చి పేదలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పోలీసుల సాక్షిగా హరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అలభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత చంద్రబాబు పరిపాలనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


