● పొలాలు, చెరువుల వద్ద 8 ఏనుగుల సంచారం
● బిక్కుబిక్కుమని ఉంటున్న రైతులు, స్థానికులు
● అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు
పార్వతీపురం రూరల్: మండలంలో గజరాజుల సంచారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎనిమిది ఏనుగుల గుంపు మండలంలో ప్రవేశించి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తిష్ఠవేసింది. పచ్చని వ్యవసాయ భూములు, చెరువుల సమీపంలో స్వేచ్ఛగా సంచరిస్తుండడంతో రైతులు, సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఉంటున్నారు. తాజాగా ఆదివారం ఈ ఏనుగుల గుంపు లక్ష్మీనారాయణపురం, కృష్ణపల్లి, బండిదొర వలస గ్రామాల మధ్య ఉన్న చెరువు ప్రాంతంలోకి ప్రవేశించింది. గుంపుగా సంచరిస్తున్న ఈ దృశ్యాలు స్థానికుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తున్నాయి. గజరాజుల సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి స్థానికులను అప్రమత్తం చేశారు. ఏనుగులు తిరుగుతున్న చెరువులు, వ్యవసాయ భూముల వైపు ప్రజలెవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు సైతం అటవీశాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. అయినప్పటికీ నిత్యం పొలాల వద్దే ఏనుగులు తిరుగుతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టి, ఈ ఏనుగుల గుంపును తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఏనుగుల భయం నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


