విజయనగరం టౌన్: పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసులు ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని ఎస్పీ ఎఆర్.దామోదర్ సూచించారు. స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద శనివారం బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. నిర్దేశించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించి, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేటుచేసుకోకుండా చూడాలన్నారు. పోలింగ్ అధికారి పోలీసుల సహాయం కోరితే తప్ప ఎవరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో లైన్స్ వేయించాలని, వందమీటర్ల లోపలికి ఎవరినీ అనుమతించవద్దన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వద్దు : ఎస్పీ


