● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వినతి
సాలూరు: గత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చూసి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఓటర్లను కోరారు. పట్టణంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేసి మాటకు కట్టుబడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును గుర్తించాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా సంక్షేమం అందించిన విషయాన్ని గుర్తించాలని కోరారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇలా ప్రతి ఒక్కరికీ మేలు చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్నా.. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు సరికదా... ఉన్న పథకాల్లో కూడా పార్టీలకు అనుగుణంగా కత్తెర వేసి ప్రజలను వేధిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మాటే లేదన్నారు. ఎన్నికల ముందు హడావుడి చేసి దరఖాస్తులు స్వీకరించి నేడు వాటిని మూలన పడేశారని ధ్వజమెత్తారు. యువతను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు మొండి చేయి చూపారన్నారు. ఉచిత గ్యాస్ ఉత్తిదేనని తేలిపోయిందన్నారు. ఇలా ప్రతి ఒక్కరినీ నిలువునా మోసం చేశారన్నారు. స్థానిక మంత్రి సంధ్యారాణి విష యం స్థానికులకు వేరేగా చెప్పనక్కర్లేదన్నారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సంధ్యారాణి ఇటీవల విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన విషయం అక్టోబర్ 30న పచ్చపత్రికలో ముద్రితమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీలోకి వెళ్లే ఇతర పార్టీల నాయకులను దొంగల్లా భావిస్తున్నారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతుందన్నారు. పట్టణ ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైఎస్సార్‌సీపీ నేతలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


