● నిమ్మక – తోయకల మధ్య తీవ్ర వాగ్వాదం ● పార్టీ శ్రేణుల మధ్య తోపులాట ● ప్రచారంలో మధ్యలోనే వెనుదిరిగిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి
జియ్యమ్మవలస రూరల్ : కూటమి పార్టీల మధ్య ఉన్న విబేధాలు టీడీపీ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాక్షిగా భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు ఆమె సాక్షిగా వాదులాటకు దిగారు. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. చివరకు ఈ కుమ్ములాట తీవ్రం కావడంతో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే జగదీశ్వరి మధ్యలోనే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళ్తే.. జియ్యమ్మవలస మండలం అర్నాడ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణులు శనివారం ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ఏకకాలంలో నిర్వహించారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి.. జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కూటమి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా జోగి ప్రసాదమ్మ ఎంపీటీసీగా పోటీ చేస్తుండగా కూటమి ధర్మాన్ని వీడి టీడీపీ అభ్యర్థిగా జోగి భుజంగరావును నిలబెట్టడం సమంజసమేనా? అంటూ జనసేన నాయకులు ఎమ్మెల్యే జగదీశ్వరి నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని మండలంలోని అర్నాడ ఎంపీటీసీకి పార్టీ కన్వీనర్‌గా ఉన్న భుజంగరావు తమ పార్టీ బీ ఫారం ఇస్తే మీరెలా పోటీ చేస్తారని జనసేన శ్రేణులను ప్రశ్నించారు. మండలంలో జనసేనకు రెండు ఎంపీటీసీ స్థానాలు కేటాయిస్తే మీరు ఐదు చోట్ల టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చివరకు తోపులాటకు దారితీసింది. దీంతో జనసేన శ్రేణులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చేసేదిలేక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అక్కడ నుంచి వెనుదిరిగారు.


