ప్రలోభం మొదలైంది..! | - | Sakshi
Sakshi News home page

ప్రలోభం మొదలైంది..!

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

ప్రచారం ముగిసింది.. ప్రలోభం మొదలైంది..! ● ఓట్ల వేటలో చివరి అస్త్రాలు ప్రయోగం ● తెరవెనుక తాయిలాల రాజకీయం ● పోలింగుకు మిగిలింది ఒక్క రోజే ● మౌన ప్రచారంలో మున్సిపల్‌ అభ్యర్థులు ముగిసిన ప్రచారం..

ప్రచారం ముగిసింది..
కొద్ది రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి.. ఇన్నాళ్లూ ఓటు కోసం అభ్యర్థించి, వీధి వీధినా తిరిగిన గొంతులు విశ్రాంతి తీసుకున్నాయి. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు.. ప్రచారాల ప్రలోభాలు మొదలయ్యాయి.

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోరు చివరి దశకు చేరుకుంది. ప్రచార సమయంలో ప్రజా సమస్యలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై హామీలిచ్చిన నేతలు..ఇప్పుడు ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు. మద్యం, నగదు, ఇతర తాయిలాల పంపిణీపై ఎన్నికల అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చూడడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది.

పుర ఎన్నికలు నవంబరు 1న జరగనున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగుకు 48 గంటల ముందు ప్రచా రం నిలిపివేయాలి.ఈ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో మూడు ప్రాంతాల్లో ప్రచారం ఆగిపోయింది. మైకులు మూగబోయాయి.. హామీ ల పర్వం ముగిసింది. ఓటర్లను ఆకర్షించే తెరవెనుక రాజకీయాలు మాత్రం ఊపందుకున్నాయి. వార్డుల వారీగా నగదు పంపిణీ మొదలైంది. ఓటర్లకు స్లిప్పులతో పాటు.. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వరకై నా ఇచ్చేందుకు కొంతమంది వెనుకాడడం లేదు. పోటాపోటీగా పంపకాలకు ఇప్పటికే నగదు తరలిపోయింది. మద్యం దుకాణాలు బంద్‌ అయినప్పటికీ..సరిపడా నిల్వలను ఆయా అభ్యర్థులు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. మహిళలకు బొట్టుపెట్టి..చిరు కానుకలు అందిస్తున్నారు. ఈ చివరి 48 గంటల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి? ఎవరి ప్రలోభాలకు ఓటర్లు లొంగుతారు? లేక అభ్యర్థుల భవితవ్యాన్ని అభివృద్ధి, స్థానిక సమస్యలే నిర్ణయిస్తాయా? అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement