● రెండురోజుల క్రితం ఆస్పత్రిలో బిడ్డను ప్రసవించిన గిరిజన గర్భిణి ● మోకాలి లోతు నీటిలో గెడ్డదాటి ఇంటికి చేరుకుంటున్న తల్లీబిడ్డలు
అసలే పచ్చి బాలింత. చల్లగాలి, చల్లటి నీరు తగలకూడదు. అయినప్పటికీ గత్యంతరం లేక తల్లీబిడ్డలను కుటుంబసభ్యులు గెడ్డదాటించి ఇంటికి చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీ, గుంటభద్ర గ్రామానికి చెందిన గిరిజన గర్భిణి పాలిక కాంతమ్మ రెండురోజుల క్రితం పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తరువాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చని వైద్యాధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి సుమారు 40కిలోమీటర్ల వరకు 102వాహనంలో తల్లీబిడ్డలను తీసుకువచ్చారు. గ్రామం సమీపంలో అడారుగెడ్డపై కాజ్‌వే, బ్రిడ్జి లేకపోవడంతో 102వాహనం వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. అంతేకాకుండా అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అడారుగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో మోకాళ్ల లోతులో బాలింత కాంతమ్మ నడవగా, నవజాత శిశువును ఎత్తుకుని కుటంబసభ్యులు గెడ్డదాటి గ్రామానికి చేరుకున్నారు. ఈ పరిస్థితి గిరిజనుల దారి కష్టాలకు అద్దం పడుతోంది. –మక్కువ


