శృంగవరపుకోట: సౌత్‌జోన్ కరాటే పోటీల్లో మొహంతిస్ కౌముది గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. విశాఖపట్నం వేదికగా అక్టోబర్ 25న నిర్వహించిన 5వ కియో సౌత్‌జోన్ కరాటే చాంపియన్ షిప్ 2026 (5వ కియో సౌత్ జోన్ కరాటే చాంపియన్‌షిప్)లో మొహంతిస్ కౌముది గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. దాదాపు 2,600 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీలలో పాఠశాల విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ శాంతి మొహంతి చెప్పారు. 4వ తరగతి విద్యార్థి ఎ.తేజస్వరూప్–స్వర్ణపతకం, 7వ తరగతి విద్యార్థి వి.హార్ధిక్ వినయ్–రజత పతకం, 3వ తరగతి విద్యార్థిని కె.సుదీక్ష కాంస్యపతకం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కరాటే కోచ్ శ్రీనివాసరావును, పతకాలు సాధించిన క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ శాంతి మొహంతి అభినందించారు.
రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలి
డెంకాడ: రక్తదానాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని డెంకాడ ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ రవిశంకర్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని బెటాలియన్ యూనిట్ ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం శుక్రవారం నిర్వహించారు. రక్తదానం చేస్తే సన్నబడిపోతామన్న అపోహ అందరిలో ఉందని, నిజానికి అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. మనమిచ్చే రక్తం ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడుతుందన్న విషయం గుర్తెరగాలన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని కోరారు. అనంతరం 41 మంది పోలీసులు రక్తదానం చేయగా రక్తదాతలందరికీ ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తేజస్విని, యూనిట్ మెడికల్ ఆఫీసర్ రాజేష్, డాక్టర్ మనోజ్ఞ, అడిషనల్ కమాండెంట్ సి.రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్‌లు జీవీ ప్రభాకరరావు, వీవీ అప్పారావు, డీవీ రమణమూర్తి, ఆర్‌ఐలు, జి.రవీంద్రకుమార్, జి.దామోదర్, ఎన్.గణేష్, ఎ.శ్రీనివాసరావు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సెపక్ తక్రా జిల్లా స్థాయి
ఎంపిక పోటీలు ప్రారంభం
విజయనగరం అర్బన్: స్థానిక వీటీఅగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలబాలిలకు సెపక్ తక్రా క్రీడలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే సెపక్ తక్రా పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వసిస్తారని నిర్వాహకులు డి.నారాయణరావు, ఎం.రమ్య తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి మార్టిన్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కొత్తవలస: అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొట్లాం గ్రామానికి చెందిన కొట్యాడ సూరిబాబు (40)చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కొత్తవలస సీఐ టీవీ విజయకుమార్ శుక్రవారం తెలిపారు. గొట్లాం గ్రామానికి చెందిన సూరిబాబు కొత్తవలస మండలంలోని చీపురువలస రెవెన్యూ పరిధిలో గల తన పశువుల పాకలో ఉండగా అర్నాబ్ తుఫాన్ కారణంగా బుధవారం కురిసిన భారీ వర్షానికి పశువుల పాక వద్దగల తాటిచెట్టు విరిగి పశువుల పాకపై పడడంతో పాకలో మంచంపై ఉన్న సూరిబాబు తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు ప్రమాదాన్ని గుర్తించి సూరిబాబును కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


