విజన్‌ నగరమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విజన్‌ నగరమే లక్ష్యం

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

విజన్‌ నగరమే లక్ష్యం

విజయనగరం: ఈనెల 1న జరగనున్న విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే విజన్‌ విజయనగరమే లక్ష్యంగా పాలన సాగిస్తానని వైఎస్సార్‌సీపీ విజయనగరం మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరంలోని సుజాత ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన తండ్రి మాజీ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఆమె మాట్లాడారు. గత పది రోజులుగా విజన్‌ విజయనగరం మేనిఫెస్టోతో నగరంలోని 62 డివిజన్‌లలో ఎన్నికల ప్రచారం చేశామని చెప్పారు. అందులో భాగంగా తనను గెలిపిస్తే ప్రజల వద్దకు మేయర్‌ కార్యక్రమం పేరిట ప్రతి డివిజన్‌లో రెండు రోజుల పాటు స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 24/7 వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌ఏర్పాటు చేసి నేరుగా అధికార యంత్రాంగంతో సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. మహిళల భద్రతలో భాగంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అన్ని ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటు, అన్ని ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌, ఫీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి వీధిలో పరిశుభ్ర వాతావరణం కల్పించడం ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

పెద్దచెరువులో బోటు షికారు

విద్యలకు నిలయం, కళలకు సంస్కృతిగా నిలిచే విజయనగరాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయడంలో భాగంగా పెద్ద చెరువులో బోటు షికారు ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఏళ్లు డిప్యూటీ మేయర్‌గా పని చేసిన అనుభవంతో మీ ఇంటి అడబిడ్డగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనతో పాటు 62 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే

గడిచిన పాలకవర్గంలో ఐదేళ్ల పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయని, గడిచిన రెండున్నరేళ్లలో కూటమి నేతలు రూ.540 కోట్లతో అభివృద్ధి చేపట్టామని ప్రచారం చేస్తున్న అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని సవాల్‌ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తమను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు మాటలు చెప్పకుండా చేసిన అభివృద్ధిని చెప్పి ఓటర్లను అభ్యర్థించాలని హితవుపలికారు. కూటమికి అధికారం ఇస్తే రానున్న రోజుల్లో పీల్చే గాలికి కూడా ట్యాక్స్‌ విధిస్తారని ఎద్దేవా చేశారు.

మరింత సుందరంగా విజయనగరం అభివృద్ధి

సమావేశంలో ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈనెల 1న జరగనున్న విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న మేయర్‌ అభ్యర్థిని కోలగట్ల శ్రావణితో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని మరింత సుందరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న ఎన్నికల్లో హమీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, పెరిగిన నిత్యవసరాల ధరలతో సామన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేసిన అభివృద్ధిని చెబుతూ ప్రజలను ఓట్లు అడినట్లు చెప్పారు. తమ ప్రచార సమయంలో నమ్మి ఓటేసిన కూటమి నేతలు మోసం చేశారంటూ ప్రజలే చెబుతున్నారని, అటువంటి పాలకులు ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఎప్పుడూ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆశతో తనపై ,తన కుటుంబంపై దుష్ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని, అటువంటి చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు అందవరపు సూరిబాబు, మాజీ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మాజీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ శెట్టి వీరవెంకట రాజేష్‌, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు.

24/7 డిజిటల్‌ గ్రీవెన్స్‌ సెల్‌

ప్రజల వద్దకే మేయర్‌ కార్యక్రమంలో సమస్యల పరిష్కారం

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ప్రజరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

నగరాన్ని పర్యాటకంగా అభివృద్దికి కృషి

రెండున్నరేళ్లలో కూటమి చేసిన

అభివృద్ధి ఎక్కడ?

వైఎస్సార్‌సీపీ విజయనగరం మేయర్‌ అభ్యర్థి కోలగట్ల శ్రావణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement