పార్వతీపురంలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ | - | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో ‘రన్‌ ఫర్‌ యూనిటీ’

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

● జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి, పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రం పార్వతీపురంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా పరుగు (రన్‌ ఫర్‌ యూనిటీ) నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కూడలి నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయం వరకు జరిగిన ఈ పరుగును ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..స్వాతంత్య్రం అనంతరం 500కు పైగా సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతదేశ నిర్మాణానికి పటేల్‌ చేసిన కృషిని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం, దేశ సమగ్రతను కాపాడేందుకు అంకితమవుతామని పరుగులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో ఎస్పీ ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’ ప్రతిజ్ఞ చేయించారు. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన బి.దివాకర్‌ (ప్రథమ), కె.చందు (ద్వితీయ), టి.అభిషేక్‌ (తృతీయ)లకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, థామస్‌ రెడ్డి, సీఐలు వెంకట్రావు, రంగనాథం, ఏఆర్‌ ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement