న్యూస్‌రీల్
మహిళల హవా – పెరుగుతున్న ప్రాతినిధ్యం
గిరిజన ప్రాంతాల్లోనూ ప్రత్యేక చైతన్యం
ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
● జిల్లాలో మహిళా నాయికలు ● పాలనలోనూ, అభివృద్ధిలోనూ తమదైన ముద్ర
శాసించే
శక్తిగా..
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా నిర్మాణంలో, సమాజ పురోగతిలో మహిళల పాత్ర ఎనలేనిది. ‘ఇంట్లో దీపం’గా వెలిగే మహిళలు.. నేడు రాజకీయంగా, పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిధ్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి పెరిగింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలతో పాటు.. స్థానిక సంస్థల్లోనూ పెద్ద ఎత్తున నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలకు సమానంగా అవకాశాలు లభించాయంటే నాడు జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణం. పురపాలక సంఘాల నుంచి మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వరకు మహిళలు రాజకీయాల్లో తమ పాత్రను విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం ఓటర్లుగా మాత్రమే కాక.. ప్రజా సమస్యలను ప్రస్తావించే నాయకులుగా, అభివృద్ధి నిర్ణయాల్లో భాగస్వాములుగా ఎదిగేందుకు ముందడుగు వేస్తున్నారు.
స్థానిక సంస్థల్లో మహిళలు అధికారంలోకి రావడం వల్ల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఒక తల్లిగా కుటుంబ క్షేమాన్ని ఎలా కోరుకుంటారో.. అదే విధంగా తమ ప్రాంత అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని కుటుంబ బాధ్యతగా భావించి సేవలు అందిస్తున్నారు. చట్టసభలు, స్థానిక సంస్థల్లో మహిళలకు లభిస్తున్న ప్రాధాన్యం కేవలం సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా, కీలక విధాన నిర్ణయాలు శాసించే శక్తిగా వారు రూపాంతరం చెందుతున్నారు.
మన్యం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలో నిలుస్తున్నారు. కేవలం రిజర్వ్‌డ్ స్థానాలకే పరిమితం కాక.. తమ సత్తా చాటేందుకు వారు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు నాయకత్వ బాధ్యతలను భుజానకెత్తుకుంటూ రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు మహిళా నాయకత్వానికి కీలక వేదికగా మారుతున్నాయి. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రిజర్వేషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు, 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
15 జడ్పీటీసీ స్థానాల్లో ఏడు సీట్లు మహిళలవే. 15 ఎంపీపీ స్థానాల్లో ఎనిమిది వారికే. 109 ఎంపీటీసీ స్థానాలు మహిళలే దక్కించుకున్నారు.
పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలుగానూ.. పాలకొండ నగర పంచాయతీగానూ ఉంది. ఈ మూడు చోట్ల చైర్‌పర్సన్ స్థానాలు అతివలవే. పార్వతీపురంలోని 36 వార్డుల్లో 18 స్థానాలు, సాలూరులోని 32కి 16, పాలకొండలోని 28 వార్డులకు 13 స్థానాలు సీ్త్రమూర్తులవే.
పంచాయతీల పాలనలోనూ వీరిదే అగ్ర తాంబూలం. జిల్లాలో 451 పంచాయతీలకు, 4,128 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల్లో 223, వార్డులకు సంబంధించి 2,058 స్థానాలు వారికే దక్కాయి.
ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలకూ అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో జనరల్ స్థానాల్లోనూ పెద్ద ఎత్తున అదృష్ట లక్ష్ములు పోటీకి సిద్ధమవుతున్నారు.
ఈ అవకాశాలు మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసే మార్గాన్ని తెరవడమే కాక.. గ్రామీణ పాలనలో తమ ఆలోచనలు, సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడనున్నాయి. రిజర్వేషన్ల ద్వారా పదవులు దక్కడం ఒక ఎత్తయితే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం మరో ఎత్తు.
మన్యం ప్రాంతంలోని గిరిజన మహిళలు సైతం రాజకీయంగా చైతన్యం చూపుతున్నారు. సాంప్రదాయ కట్టుబాట్లను అధిగమించి, సమాజ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్న గిరిజన మహిళా నాయకురాళ్లు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువు, అవగాహన పెరగడంతో తమ హక్కుల కోసం పోరాడటమే కాకుండా, సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మారుతున్న ఈ రాజకీయ ముఖచిత్రం శుభపరిణామంగా చెప్పవచ్చు. మహిళలు కేవలం గృహాలకే పరిమితం కాకుండా పరిపాలనా దక్షతను చాటుకుంటూ, జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక భూమిక పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మహిళలు నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగినప్పుడే సాధికారతకు సార్థకత. ఆ నాయకత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడే స్థానిక ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బలంగా విశ్వసించింది. నాటి ఫలాలే రాజకీయాల్లోనూ మహిళల ప్రాధాన్యం పెరగడానికి నేడు కారణమయ్యింది.


