కొత్తవలస: ఉత్తరాంధ్రలో కూటమి నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యర్థి అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తుమ్మికాపల్లి మాజీ సర్పంచ్ విరోతి కొండలరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన నుంచి కొండలరావును కూటమి నేతలు బెదిరింపులకు గురి చేస్తూ వచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారులో కొండలరావు తుమ్మికాపల్లి బయలుదేరారు. ఆయన కదలికలపై నిఘా పెట్టిన కూటమి నాయకులు శుక్రవారం రాత్రి వడ్డిపేట సమీపంలో తమ కార్లు అడ్డంగా ఉంచి కొండలరావు కారును అడ్డుకున్నారు. దీంతో కారు లో నుంచి దిగిన కొండలరావును నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ వేరే కారులోకి నెట్టే ప్రయత్నం చేశారు.
ఈ సమయంలో కొండలరావు చాకచక్యంగా తప్పించుకొని వేరొక మార్గంలో తన ఇంటికి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని సీఐ విజయకుమార్, ఎస్పీకి ఫొన్‌లో వివరించారు. దీంతో ఎస్పీ దామోదర్ కొత్తవలస మండలంలో శనివారం పర్యటించి వివరాలు సేకరించారు.
జెడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపు
లేకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి


