అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి

● డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో ముమ్మర దర్యాప్తు

రామభద్రపురం: మండలంలోని ఇట్లామామిడిపల్లిలో ఓ వృద్ధురాలు శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి దాలమ్మ (68) ఉక్కబోత వల్ల శుక్రవారం రాత్రి 11.30 గంటల వరకు ఇంటి బయటే కుర్చుంది. అనంతరం ఇంటిలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం 7 గంటలైనా దాలమ్మ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అదేవీధికి చెందిన మామిడి రమణమ్మ ఓ కుర్రాడి సహాయంతో తలుపు గడియ తొలగించగా.. లోపల దాలమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఈ విషయాన్ని గ్రామంలోనే ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే దాలమ్మ పెద్ద కుమారుడు మామిడి గణపతి వచ్చి చూడగా మృతురాలి తల వెనుక భాగంలో తీవ్ర గాయం కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం, డబ్బుల కోసమే ఎవరో తన తల్లిని హత్య చేశారని గణపతి ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై జ్ఞానప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విషయాన్ని డీఎస్పీ గోవిందరావు, సీఐ మల్లికార్జునరావులకు తెలియజేశారు. దీంతో డీఎస్పీ, సీఐలు కూడా గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ముక్కు, చెవులకు బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే బీరువా తెరిచి చూడగా.. డబ్బులున్నాయి. దీంతో విజయనగరం నుంచి క్లూస్‌ టీమ్‌ సభ్యులను రప్పించి స్థానికుల వేలిముద్రలు సేకరించారు. దాలమ్మ ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయిందా.. ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement