కాకరేపుతున్న కొఠియా | - | Sakshi
Sakshi News home page

కాకరేపుతున్న కొఠియా

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

కాకరేపుతున్న కొఠియా

సాలూరు: ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా ప్రాంత నాయకులు చేపడుతున్న ప్రచారాన్ని ఒడిశా రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. పట్టుచెన్నేరు వద్ద ఆంధ్రా నేతలను ఒడిశా నాయకులు అడ్డుకుని ఆంధ్రా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ తెలుగులో ఉన్న గ్రామం బోర్డును ఒడిశా నాయకులు తొలగించారు. దీంతో కొఠియా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు, ప్రజలకు ఆంధ్రా ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

కొఠియాలో పర్యటించిన బీజేడీ

నాయకులు

కొఠియాలో ఒడిశా రాష్ట్ర బీజేడీ నాయకులైన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం పర్యటించారు. ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలపై నిరసన తెలిపారు. ఆంధ్రా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిజుజనతాదళ్‌ అధ్యక్షుడు మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ ఒడిశా సీఎంకు ఈ కొఠియా సమస్యపై లేఖ రాశారని, ఎన్నికల మేనిఫెస్టోలో కొఠియా సమస్య పరిష్కరిస్తామని తెలిపిన ఈ బీజేపీ నేతలు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారంటూ బీజేపీ ప్రభుత్వాన్ని నవీన్‌పట్నాయక్‌ విమర్శించారని పేర్కొన్నారు. అయితే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్‌పట్నాయక్‌ ఈ సమస్య పరిష్కరించకలేకపోయారంటూ ఒడిశా ప్రభుత్వమూ చేస్తున్న ప్రతివిమర్శలతో ఈ కొఠియా గ్రామాల వివాద సమస్య ఒడిశాలో అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతోంది.

అవగాహన కల్పించిన ఆంధ్రా సిబ్బంది

ఆంధ్రాప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ‘ఆంధ్రా ఎన్నికలపై, ఒడిశా డేగ కన్ను’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్‌ డా.ఎన్‌ప్రభాకరరెడ్డి ఆదేశాలతో అధికారులు స్పందించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో పర్యటించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అవగాహన పెంపొందించారు.

ఆంధ్రా పాలకుల్లో చిత్తశుద్ధి కరువు

కొఠియా గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని ఆంధ్రా కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, ఆంధ్రాలో బీజేపీతో కూడిన కూటమి పార్టీలు అధికారంలో ఉండడం, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరడంతో నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా ఈ కొఠియా గ్రామాల సమస్యకు పరిష్కారం సాధ్యమేనని ఈ ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఒడిశాలో అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం

కొఠియా గ్రామాల్లో ఆంధ్రా నాయకుల ప్రచారం అడ్డగింత

తెలుగులో ఉన్న గ్రామం పేరు బోర్డును పీకేసిన ఒడిశా నాయకులు

ఆంధ్రా గో బ్యాక్‌..అంటూ నినాదాలు

రక్షణ కల్పించాలని కోరుతున్న

అభ్యర్థులు, ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement