విజయనగరం టౌన్: ఎన్నికల నిర్వహణకు అవరోధాలు కల్పించే అసాంఘిక శక్తుల తాటతీస్తామని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి గంటస్తంభం, మూడులాంతర్లు, కోట జంక్షన్, లయన్స్ క్లబ్ జంక్షన్ మీదుగా బాలాజీ కూడలి, జొన్నగుడ్డి వరకూ పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఎస్పీ దామోదర్ స్వయంగా కవాతులో పాల్గొని, ఎన్నికలలో స్వేచ్ఛగా ఓటువేయాలని, బెదిరింపులకు, ప్రలోభాలాకు లొంగవద్దని, పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలతో సంయమనంతో వ్యవహరించాలని, దుందుడుకు చర్యలకు పాల్పడే వారిపట్ల, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే అసాంఘిక శక్తులతో కఠినంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిబంధనల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. చట్టాన్ని గౌరవించే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. పైడితల్లి అమ్మవారి పండగ, ప్రాదేశిక ఎన్నికలు వరసగా వచ్చినందున పోలీసు అధికారులు, సిబ్బంది మరింత శ్రమించి ప్రాదేశిక ఎన్నికలు, అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతోనూ, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలైన జొన్నగుడ్డి, బాబామెట్ట, పూల్‌బాగ్, వైఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేందుకు వంద మంది పోలీసు సిబ్బందిని కేటాయించి, రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహిస్తామన్నారు.
ప్రశాంతంగా పైడితల్లి జాతర, ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించాలి :
ఎస్పీ ఏఆర్ దామోదర్
600 మంది పోలీస్ బలగాలు,
అధికారులు, సిబ్బందితో కవాతు


