బాలికలకు 20 ఏళ్లు నిండినా.. | - | Sakshi
Sakshi News home page

బాలికలకు 20 ఏళ్లు నిండినా..

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

బాలికలకు 20 ఏళ్లు నిండినా..

● అందని బాలికా సంరక్షణ పథకం

● వేలాది మంది ఎదురుచూపులు

● ఇద్దరు ఆడపిల్లలైతే రూ.60 వేలు..

● ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష ఇవ్వాలి

విజయనగరం ఫోర్ట్‌: గంట్యాడ మండలానికి చెందిన పి.నీలిమ 2002లో జన్మించింది. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది. అప్పట్లో వారి తల్లిదండ్రులు బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్‌) పథకం కోసం దరఖాస్తు చేయగా వారికి పథకానికి సంబంధించిన బాండు కూడా ఇచ్చారు. 20 ఏళ్లు నిండిన తర్వాత ఆమెకు రూ.30 వేలు రావాలి. ఆమెకు 24 ఏళ్లు వచ్చినా డబ్బులు అందలేదు. ఐసీడీఎస్‌ అధికారులను అడిగినా వారు ఏమీ చెప్పడం లేదు. ఇలా ఈమె ఒక్కరే కాదు. జీసీపీఎస్‌ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకం కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురుచూస్తున్నారు. కొంతమందికి వివాహాలు కూడా జరిగిపోయాయి. ఇంకొంతమంది ఆ డబ్బులు వస్తే వివాహం చేయాలని చూస్తున్నారు. ఈ పథకం కోసం పేద వర్గాలకు చెందిన వారే అధికశాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారంతా పథకం లబ్ధికోసం నిరీక్షిస్తున్నారు. ఆడపిల్లలను కన్నవారిని ప్రోత్సహించడం కోసం బాలికా సంరక్షణ పథకాన్ని అప్పట్లో ప్రవేశ పెట్టారు. ఒక ఆడపిల్ల అయితే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలైతే రూ. 60 వేలు (ఒక్కో ఆడపిల్లకు రూ.30 వేలు చొప్పున) బాలికకు 20 ఏళ్లు నిండిన తర్వాత అందివ్వాలన్నది పథకం ఉద్దేశ్యం.

వేలాది మంది ఎదురుచూపులు

బాలికా సంరక్షణ పథకం నిబంధనల ప్రకారం జిల్లాలో చాలా మంది బాలికలకు 20 ఏళ్లు నిండాయి. వారందరికీ ప్రభుత్వం డబ్బులు అందజేయాలి. 20 ఏళ్లు నిండిన అమ్మాయిల తల్లిదండ్రులు సీడీపీఓ, పీడీ కార్యాలయాల్లో డబ్బుల గురించి అడిగితే అక్కడి అధికారులు స్పష్టత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,980 మంది జీసీపీఎస్‌ పథకానికి అర్హులున్నారు. వారిలో ఒక ఆడపిల్లకు రూ.లక్ష వస్తుందని అశించిన తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకున్నారు. పేదవారైతే వివాహ ఖర్చులకు సరిపోతాయని ఆశించారు.

ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది

బాలికా సంరక్షణ పథకానికి సంబంధించి 20 ఏళ్లు దాటిన వారికి డబ్బుల చెల్లింపు విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది.

కేవీ బాలామణి, పీడీ, ఐసీడీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement