ఆంధ్రా ఎన్నికలపై ఒడిశా డేగ కన్ను | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఎన్నికలపై ఒడిశా డేగ కన్ను

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

● కొఠియా గ్రామాల్లో కొరాపుట్‌

సబ్‌కలెక్టర్‌ పర్యటన

సాలూరు: ఆంధ్రాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఒడిశా ప్రభుత్వం డేగకన్ను వేసింది. ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామాల ఎన్నికలపై ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు కొరాపుట్‌ సబ్‌కలెక్టర్‌ ఫాబ్రీ రషీధ్‌, అధికార యంత్రాంగం మూడు రోజులుగా కొఠియా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గంజాయిభద్ర, ఎగువశెంబి, నేరెళ్లవలస తదితర గ్రామాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో ఓటు హక్కు ఎందుకు వినియోగించుకుంటారని ఈ ప్రాంతాల్లో ప్రజలను సబ్‌కలెక్టర్‌ అడుగుతున్నారు. మాకు రెండు రాష్ట్రాలు సమానమేనని కావున రెండు రాష్ట్రాల్లోనూ తాము ఓటు హక్కు వినియోగించుకుంటామని అక్కడి ప్రజలు సమాధానమిస్తున్నారు. కొఠియా గ్రామాల సమస్య పరిష్కారమయ్యేవరకు ఈ పద్ధతినే అనుసరిస్తామని ప్రజలు చెబుతున్నారు. అయితే మహిళ అయిన సబ్‌కలెక్టర్‌ మూడు రోజులుగా ఈ ప్రాంతంలోనే ఉండి పర్యటిస్తుండడం, ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాల ప్రజలను ఓటు హక్కు వినియోగించుకుండా అడ్డుకోగా, నాటి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో ఐటీడీఊ పీఓ కూర్మనాథ్‌ బారికేడ్లను నెట్టుకుంటూ వెళ్లి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకున్న చర్యలను అక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

ఎన్నికల ఆర్‌ఓకు కొఠియా ప్రజల వినతిపత్రం

ఇదే క్రమంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆంధ్రాలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొఠియా గ్రామాల నాయకులు, ప్రజలు గురువారం ఎన్నికల రిటర్నింట్‌ అధికారి గ్రౌండ్‌ వాటర్‌ డీడీ రమణమూర్తికి వినతిపత్రం అందించారు. ఇటు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ, అటు ఒడిశాలోను బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కొఠియా గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వ చర్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ గ్రామాల్లో జరగడానికి ఒడిశా ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా అడ్డుకుంటుందా? కొఠియా గ్రామాల్లో ఎన్నికలపై ఒడిశా వ్యూహమేంటనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆంద్రా అధికారులు ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారనేది మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement