● వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీచోరీ
● సుమారు రూ.కోటి విలువైన ఆభరణాలు మాయం
● రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు, క్లూస్ టీమ్
విజయనగరం టౌన్: స్థానిక అరుంధతి నగర్ కాలనీలో కొలువైన శ్రీ వైభవ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడి ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవారి ఆభరణాలను దొంగిలించుకుపోయారు. గురువారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన పూజారులు, కమిటీ ప్రతినిధులు తలుపులు తెరిచి ఉండడం చూసి హతాశయులై తేరుకుని, చోరీకి జరిగినట్లు గుర్తించి వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు, డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలను సేకరించింది. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ స్వామి, అమ్మవారికి అలంకరణలో సుమారు 35 కిలోలపైన ఉన్న వెండి ఉందని, అదేవిధంగా 45 గ్రాములకు పైగానే బంగారు ఆభరణాలు ఉన్నాయని ప్రాథమికంగా రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా చాలా ఆభరణాలు ఉన్నాయని, అవికూడా లిస్ట్ ప్రకారం తీసి వివరిస్తామన్నారు. వాటిన్నంటి విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని కమిటీ ప్రతినిధులు అంచనా వేశారు. ఆలయ ధర్మకర్త గనివాడ దివాన్‌జీ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సురేంద్ర నాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


