లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో గోల్డ్‌స్టార్ జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ రొంగలి బంగారయ్య(76) మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై జె.రామకృష్ణ, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంగారయ్య తన అల్లుడు పద్మనాభంతో కలిసి కొత్తవలస కోర్టు వాయిదాకు హాజరై తిరిగి తమ స్వగ్రామమైన వేపాడ మండలం గుడివాడకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో గోల్డ్‌స్టార్ జంక్షన్ సమీపంలోకి వచ్చే సరికి ద్విచక్రవాహనం టైర్ పంక్చర్ అవడంతో బంగారయ్య వాహనాన్ని నడిపిస్తూ వస్తుండగా కొత్తవలస నుంచి వేగంగా ప్రయాణికులతో వచ్చిన ఆటో వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు అంచున పడడంతో బలమైన గాయాలు కావడంతో ఎల్.కోట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించగా అక్కడ వైద్యులు పరిక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని అల్లుడు పధ్మనాభం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు నుంచి జారిపడి ఝార్ఖండ్ వాసి మృతి
కొత్తవలస: చికిత్స నిమిత్తం వెల్లూరుకు రైల్లో వెళ్తుండగా కొత్తవలస రైల్వేస్టేషన్‌లో రెండో ఫ్లాట్‌ఫామ్‌సై జారి పడి ఝార్ఖండ్ వాసి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబందించి విశాఖపట్నం జీఆర్‌పీ ఎస్సై కేటీఆర్.లక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం హజారిబాగ్ జిల్లాకు చెందిన అజిత్ గోపి తన కూతురుతో కలిసి బెంగళూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో చికిత్స నిమిత్తం వెల్లూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చే సరికి మరుగుదొడ్డి కోసం లేచి వెళ్తుండగా డోర్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా తల విసిరి ప్లాట్‌ఫామ్ మీద పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు సుదర్శన్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ హ్యాండ్‌బాల్ పోటీలకు విజయనగరం జిల్లా కేంద్రానికి ఆర్.సుదర్శన్‌కుమార్ అర్హత సాధించాడు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈనెల 27 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి అండర్–14 స్కూల్ గేమ్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.కాంచన, సీనియర్ ఉపాధ్యాయుడు రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్, రమేష్‌లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవడంతో పాటు విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పాలని వారు ప్రోత్సహించారు.


